దారుణం : బాలికపై 8మంది అత్యాచారం | 8 People Committed Sexual Assault With Minor Girl In Manuguru Town | Sakshi
Sakshi News home page

దారుణం : బాలికపై 8మంది అత్యాచారం

Published Sat, Nov 16 2019 10:37 AM | Last Updated on Sat, Nov 16 2019 10:42 AM

8 People Committed Sexual Assault With Minor Girl In Manuguru Town - Sakshi

సాక్షి, మణుగూరు(ఖమ్మం) : మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్యగనర్‌కు చెందిన మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ బి.రాంమాంజనేయులు ఘటన వివరాలను వెల్లడించారు. గత నెల 27న బాధిత బాలిక తన తల్లికి పరిచయస్తులైన దుమ్ముగూడెం మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పూజారి కల్యాణ్‌కు భద్రాచలం వస్తున్నానని ఫోన్‌ నుంచి మెస్సేజ్‌ పంపింది. కల్యాణ్‌ బాలికను ద్విచక్రవాహనంపై తన ఇంటికి తీసుకెళ్లి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా అనుభవించాడు.

అయితే అక్టోబర్‌28న బాలికను కల్యాణ్‌ భద్రాచలం బస్టాండ్‌లో దింపాడు. ఆమె మణుగూరుకు చేరుకుంది. మణుగూరు నుంచి తన చిన్ననానమ్మ గ్రామమైన గంగోలు వెళ్లేందుకు సాయిబాబా గుడి వద్ద మణుగూరుకు చెందిన ముత్తారపు వెంకటేష్‌ ఆటో వద్దకు వచ్చి భద్రాచలం వెళ్లాలని చెప్పింది. వెంకటేష్‌ బాలికను తప్పుదారి పట్టించి పర్ణశాల తీసుకెళ్లి సాయంత్రం వరకు బోటు షికారు చేయించాడు. అనంతరం బాలికతో ఆటోలో వస్తుండగా గంగోలు వద్ద ఆపమన్నా ఆపకుండా తీసుకొచ్చి సారపాక దాటాక రెడ్డిపాలెం వెళ్లే మట్టి దారిలో కొంతదూరం తీసుకొచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడాలనుకున్నాడు.

అదే ప్రాంతంలో ఉన్న సందెళ్ల రామాపురం గ్రామానికి చెందిన సోడె రాంబాబు ఏలియాస్‌ బాబు, పొడియం సాయి, తెల్లం కృష్ణ, ఆంతోటి ప్రశాంత్, వినయ్‌లు విషయాన్ని గమనించి ఆటో వద్దకు వచ్చారు. వీరిలో ఇద్దరు కాపలా ఉండి మితావారు ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించి ఆటో డ్రైవర్‌ను, బాలికను ఆటో ఎక్కించి పంపించారు. దీంతో ఆటో డ్రైవర్‌ బాలికను మణుగూరు గుట్ట మల్లారంలోని శివబాలాజీ లాడ్జ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంచాడు.

ఆటో డ్రైవర్‌ తెల్లవారు జామున బాలికను తిరిగి భద్రాచలం తీసుకెళ్లగా తనపై అత్యాచారం జరిపిన వారిలో ఒకడు వెంబడించాడు. భయంతో అదే ఆటోలో మణుగూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంది. ఆటో డ్రైవర్‌ బాలికను భద్రాచలం బస్సు ఎక్కించగా బాలిక సీతారామపురంలోని కల్యాణ్‌ కటింగ్‌ సాపు వద్దకు వెళ్లింది. కల్యాణ్‌ బాలికను ద్విచక్ర వాహనంపై మళ్లీ భద్రాచలం తీసుకొచ్చాడు. అక్కడ తను బట్టలు మార్చుకోవాలని అడగగా భద్రాచలంలోని సాయిబాబా గుడి ఏరియా వెనక తన స్నేహితుడి రూంకు తీసుకెళ్లి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అక్కడి నుంచి బాలికను గంగోలులో విడిచిపెట్టాడు. గంగోలులో చిననానమ్మ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక తిరిగి భద్రాచలం వచ్చి కల్యాణ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీంతో కల్యాణ్‌ బాలిక తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో బాలిక తల్లి, మారు తండ్రి ఆటోలో భద్రాచలం వెళ్లి బాలికను ఇంటికి తీసుకొచ్చారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అత్యాచారానికి పాల్పడిన అందరినీ అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆటోను, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వీరిపై మైనర్‌ బాలికపై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ షుకూర్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement