బాసిత్ , టెలిగ్రాం ,థ్రీమా
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సిటీలో అరెస్టు చేసిన ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌కు ఢిల్లీలోనూ నెట్‌వర్క్ ఉంది. ఇతడితో పాటు చిక్కిన ఖదీర్‌ను విచారిస్తున్న ఎన్‌ఐఏ ఢిల్లీ యూనిట్ బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒకరితో బాసిత్ నేరుగా సంబంధాలు నెరిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఆద్యంతం యాప్స్ ద్వారానే సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న వారికి ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్న అధికారులు వీరి అరెస్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కేసులో ఎన్‌ఐఏ ఢిల్లీ యూనిట్ అధికారులు ఈ నెల 12న బాసిత్, ఖదీర్‌లను అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిద్దరినీ ఢిల్లీ తరలించిన అధికారులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 13న మొదలైన ఈ విచారణ శుక్రవారం వరకు జరగనుంది. దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అబుదాబి మాడ్యుల్‌లో బాసిత్ సైతం కీలకంగా వ్యవహరించాడని అధికారులు చెబుతున్నారు. ఐసిస్‌లో చేరాలనే ఉద్దేశంతో అబ్దుల్లా బాసిత్ 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలిసి బంగ్లాదేశ్ మీదుగా అఫ్ఘానిస్థాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. బంగ్లాదేశ్ చేరుకోవడం కోసం కోల్‌కతా వరకు వెళ్లిన వీరిని అక్కడ పట్టుకున్న పోలీసులు నగరానికి తరలించారు. కౌన్సెలింగ్ చేసిన అనంతరం వీరిని విడిచిపెట్టారు. అయినప్పటికీ తమ పంథా మార్చకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
దీనికి ముందు మాజ్ అనేకసార్లు మిగిలిన ఇద్దరితో కలిసి హుమాయున్‌నగర్‌లోని తన ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించాడు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని పీఓకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్ 24న ప్రయాణం ప్రారంభించారు. 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ పంథా మార్చుకోని బాసిత్ విదేశాలతో పాటు ఢిల్లీ, కాశ్మీర్‌ల్లో ఉన్న ఐసిస్ నాయకులతో సంబం«ధాలు కొనసాగించాడు. సోషల్‌మీడియా యాప్స్ థ్రీమా, టెలిగ్రాం యాప్స్ ద్వారా సంప్రదింపులు చేసేవాడు. దుబాయ్‌లో ఉన్న అబు హజాయ్‌ఫా అనే ఐసిస్ కీలక ఉగ్రవాదితో పాటు ఢిల్లీలో ఉన్న వారితోనూ బాసిత్ దగ్గరగా వ్యవహరించాడు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్ళిన ఇతగాడు అక్కడకు వచ్చిన కాశ్మీర్‌కు చెందిన వ్యక్తిని సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఓ ప్రాంతంలో కలిశాడు. ఆ సమావేశంలో ఆ ప్రాంతానికే చెందిన ఓ యువకుడు పాల్గొన్నాడు. బాసిత్ విచారణలో ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఎన్‌ఐఏ అధికారులు సెంట్రల్ ఢిల్లీకి చెందిన యువకుడితో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ చేస్తున్న వీరిపై తదుపరి ఏ చర్యలు తీసుకోవాలన్నది గురువారం నాటికి నిర్ణయించలేదు. మరోపక్క ఈ నెల 6న ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లోని ఏడుగురి ఇళ్ళల్లో సోదాలు చేశారు. వీరిని వారం పాటు విచారించిన అనంతరం బాసిత్, ఖదీర్‌లను అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన వారిని ఢిల్లీ పిలిపిస్తున్న ప్రత్యేక బృందం వివిధ కోణాల్లో విచారిస్తోంది. శుక్రవారంతో బాసిత్, ఖదీర్‌ల పోలీసు కస్టడీ ముగియనుండటంతో ఆపై మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment