abdul basith
-
పుణేలో చిక్కింది.. అబ్దుల్లా బాసిత్ అనుచరులే !
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మహారాష్ట్రలోని పుణేలో సోమవారం అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులూ అబ్దుల్లా బాసిత్ అనుచరులుగా తేలింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బాసిత్ స్పార్ట్ ఫోన్ వినియోగిస్తూ వివిధ యాప్స్ ద్వారా అనేక మందిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పుణేలో చిక్కిన ఇద్దరూ ఐసిస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) మాడ్యుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది మార్చ్‌లో ఢిల్లీలో చిక్కిన కాశ్మీర్ జంటకు, ఇప్పుడు పుణేలో అరెస్టు అయిన ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఎన్ఐఏ అధికారులు సోమవారం పుణేలో అరెస్టు చేసిన నబీల్ ఎస్ ఖాత్రి ఓ జిమ్ నిర్వహిస్తుండగా... ఇతడి స్నేహితురాలు సాదియా అన్వర్ షేక్ జర్నలిజం చదువుతోంది. చంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటరŠూయ్వతో తన భావజాలంతో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. సీఏఏకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ ఓ గ్రూపును తయారుచేయడం మొదలెట్టాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన భార్యాభర్తలు జహన్‌జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. ఢిల్లీలోని ఓక్లా ఏరియాలో ఉన్న ఈ జంటను ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు మార్చ్‌లో పట్టుకున్నారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నబీల్, సాదియాల పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరు కూడా వివిధ యాప్స్ ద్వారా బాసిత్ ఇస్తున్న ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు. బాసిత్, సామి, నబీల్‌లు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాలని పథక రచన చేస్తున్నారు. నకిలీ పేర్లతో సిమ్ కార్డుల సమీకరించడంతో పాటు స్థానికంగా దొరికే పదార్థాలతో బాంబుల్ని తయారు చేయడం పైనా దృష్టి పెట్టారు. బాసిత్ ద్వారానే స్ఫూర్తి పొందిన పుణేకు చెందిన నబీల్, సాదియాలు ఐసిస్‌కు చెందిన ఖురాసన్ మాడ్యుల్లో ఉగ్రవాదులుగా మారారు. కశ్మీరీ జంట విచారణలో వీరి వ్యవహారం పైనా ఎన్ఐఏకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జంట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ డేటా విశ్లేషణ, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బాసిత్‌ను మరో సారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బాసిత్ కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. -
థ్రీమా, టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ వైపు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సిటీలో అరెస్టు చేసిన ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌కు ఢిల్లీలోనూ నెట్వర్క్ ఉంది. ఇతడితో పాటు చిక్కిన ఖదీర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒకరితో బాసిత్ నేరుగా సంబంధాలు నెరిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఆద్యంతం యాప్స్ ద్వారానే సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న వారికి ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్న అధికారులు వీరి అరెస్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కేసులో ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ అధికారులు ఈ నెల 12న బాసిత్, ఖదీర్‌లను అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిద్దరినీ ఢిల్లీ తరలించిన అధికారులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 13న మొదలైన ఈ విచారణ శుక్రవారం వరకు జరగనుంది. దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అబుదాబి మాడ్యుల్లో బాసిత్ సైతం కీలకంగా వ్యవహరించాడని అధికారులు చెబుతున్నారు. ఐసిస్‌లో చేరాలనే ఉద్దేశంతో అబ్దుల్లా బాసిత్ 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలిసి బంగ్లాదేశ్ మీదుగా అఫ్ఘానిస్థాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. బంగ్లాదేశ్ చేరుకోవడం కోసం కోల్‌కతా వరకు వెళ్లిన వీరిని అక్కడ పట్టుకున్న పోలీసులు నగరానికి తరలించారు. కౌన్సెలింగ్ చేసిన అనంతరం వీరిని విడిచిపెట్టారు. అయినప్పటికీ తమ పంథా మార్చకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి ముందు మాజ్ అనేకసార్లు మిగిలిన ఇద్దరితో కలిసి హుమాయున్‌నగర్‌లోని తన ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించాడు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని పీఓకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్ 24న ప్రయాణం ప్రారంభించారు. 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ పంథా మార్చుకోని బాసిత్ విదేశాలతో పాటు ఢిల్లీ, కాశ్మీర్ల్లో ఉన్న ఐసిస్ నాయకులతో సంబం«ధాలు కొనసాగించాడు. సోషల్‌మీడియా యాప్స్ థ్రీమా, టెలిగ్రాం యాప్స్ ద్వారా సంప్రదింపులు చేసేవాడు. దుబాయ్‌లో ఉన్న అబు హజాయ్ఫా అనే ఐసిస్ కీలక ఉగ్రవాదితో పాటు ఢిల్లీలో ఉన్న వారితోనూ బాసిత్ దగ్గరగా వ్యవహరించాడు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్ళిన ఇతగాడు అక్కడకు వచ్చిన కాశ్మీర్‌కు చెందిన వ్యక్తిని సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఓ ప్రాంతంలో కలిశాడు. ఆ సమావేశంలో ఆ ప్రాంతానికే చెందిన ఓ యువకుడు పాల్గొన్నాడు. బాసిత్ విచారణలో ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఎన్ఐఏ అధికారులు సెంట్రల్ ఢిల్లీకి చెందిన యువకుడితో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ చేస్తున్న వీరిపై తదుపరి ఏ చర్యలు తీసుకోవాలన్నది గురువారం నాటికి నిర్ణయించలేదు. మరోపక్క ఈ నెల 6న ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌లోని ఏడుగురి ఇళ్ళల్లో సోదాలు చేశారు. వీరిని వారం పాటు విచారించిన అనంతరం బాసిత్, ఖదీర్‌లను అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన వారిని ఢిల్లీ పిలిపిస్తున్న ప్రత్యేక బృందం వివిధ కోణాల్లో విచారిస్తోంది. శుక్రవారంతో బాసిత్, ఖదీర్‌ల పోలీసు కస్టడీ ముగియనుండటంతో ఆపై మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చెత్త రాయబారి మీరే....
న్యూఢిల్లీః అమెరికాలో పాక్ రాయబారి అజీజ్ అహ్మద్ చౌదరిపై భారత్‌లో పాక్ రాయబారిగా గతంలో వ్యవహరించిన అబ్దుల్ బాసిత్ నిప్పులు చెరిగారు. అజీజ్ వంటి పనికిమాలిన విదేశీ కార్యదర్శిని ఇంతవరకూ చూడలేదని, ఆయనకు గుండె సరైన స్థానంలో లేదని బాసిత్ మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో కూడిన లేఖను ఏకంగా అజీజ్ చౌదరికే పంపారు. ఈ ఏడాది జులై 5న రాసిన లేఖ ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక పత్రిక డాన్ ఈ విషయాన్ని నిర్థారించింది ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పాక్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన అజీజ్ అనంతరం అమెరికాలో పాక్ రాయబారిగా నియమితులయ్యారు. అమెరికాలో ఇప్పటివరకూ పనిచేసిన రాయబారుల్లో మీరే చెత్త రాయబారిగా మిగులుతారన్నదే నా ఆందోళన అంటూ ఈ లేఖలో బాసిత్ పేర్కొనడం గమనార్హం. దౌత్య వృత్తి మీకు సరిపడదంటూ అజీజ్‌కు బాసిత్ సలహా ఇవ్వడం లేఖలో మరో ట్విస్ట్. అజీజ్ వైఫల్యాలను ప్రస్తావించిన బాసిత్....2015లో రష్యాలో భారత ప్రధాని మోడీతో కలిసి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంయుక్త ప్రకటన ఇవ్వడం, ఐరాస మానవ హక్కుల మండలిలో తిరిగి ఎన్నికవ్వడంలో పాక్ వైఫల్యం అజీజ్ లోపాలుగా పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది భారత్-పాక్ క్రికెట్ సిరీస్
హైదరాబాద్: వచ్చే ఏడాది భారత్-పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ ప్రారంభమవుతుందని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 వరకు ఆరు సిరీస్‌లు నిర్వహించాలన్నది తమ ఆలోచనగా చెప్పారు. హైదరాబాద్ ప్రజల ఆదరాభిమానాలు మరిచిపోలేనివన్నారు. భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. దక్షిణాసియాలో వ్యాపార, వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాలన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద బాధితురాలని చెప్పారు. అక్కడ ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయని బాధపడ్డారు. ఇప్పటికే 55వేల మంది అమాయక ప్రజలు చనిపోయారని తెలిపారు. **