పుణేలో చిక్కింది.. అబ్దుల్లా బాసిత్‌ అనుచరులే ! | NIA Arrest Abdul Basith Fallowers in Pune | Sakshi
Sakshi News home page

పుణేలో చిక్కింది.. అబ్దుల్లా బాసిత్‌ అనుచరులే !

Published Thu, Jul 16 2020 8:07 AM | Last Updated on Thu, Jul 16 2020 8:07 AM

NIA Arrest Abdul Basith Fallowers in Pune - Sakshi

బాసిత్‌

సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మహారాష్ట్రలోని పుణేలో సోమవారం అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులూ అబ్దుల్లా బాసిత్‌ అనుచరులుగా తేలింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉన్న బాసిత్‌ స్పార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తూ వివిధ యాప్స్‌ ద్వారా అనేక మందిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పుణేలో చిక్కిన ఇద్దరూ ఐసిస్‌ అనుబంధ సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఖురాసన్‌ ప్రావెన్సీ (ఐఎస్‌కేపీ) మాడ్యుల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది మార్చ్‌లో ఢిల్లీలో చిక్కిన కాశ్మీర్‌ జంటకు, ఇప్పుడు పుణేలో అరెస్టు అయిన ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఐఏ అధికారులు సోమవారం పుణేలో అరెస్టు చేసిన నబీల్‌ ఎస్‌ ఖాత్రి ఓ జిమ్‌ నిర్వహిస్తుండగా... ఇతడి స్నేహితురాలు సాదియా అన్వర్‌ షేక్‌ జర్నలిజం చదువుతోంది. చంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్‌ ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్‌లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్‌ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు.

ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్‌... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటరŠూయ్వతో తన భావజాలంతో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్‌ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న బాసిత్‌ వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఆధారంగా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. సీఏఏకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ ఓ గ్రూపును తయారుచేయడం మొదలెట్టాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన భార్యాభర్తలు జహన్‌జెబ్‌ సామి, హీనా బషీర్‌ బేగ్‌ కీలకంగా మారారు. ఢిల్లీలోని ఓక్లా ఏరియాలో ఉన్న ఈ జంటను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారులు మార్చ్‌లో పట్టుకున్నారు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.

ఇందులో భాగంగానే నబీల్, సాదియాల పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరు కూడా వివిధ యాప్స్‌ ద్వారా బాసిత్‌ ఇస్తున్న ఆదేశాల ప్రకారం సోషల్‌ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు. బాసిత్, సామి, నబీల్‌లు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాలని పథక రచన చేస్తున్నారు. నకిలీ పేర్లతో సిమ్‌ కార్డుల సమీకరించడంతో పాటు స్థానికంగా దొరికే పదార్థాలతో బాంబుల్ని తయారు చేయడం పైనా దృష్టి పెట్టారు. బాసిత్‌ ద్వారానే స్ఫూర్తి పొందిన పుణేకు చెందిన నబీల్, సాదియాలు ఐసిస్‌కు చెందిన ఖురాసన్‌ మాడ్యుల్‌లో ఉగ్రవాదులుగా మారారు. కశ్మీరీ జంట విచారణలో వీరి వ్యవహారం పైనా ఎన్‌ఐఏకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జంట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ కాల్‌ డేటా విశ్లేషణ, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బాసిత్‌ను మరో సారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బాసిత్‌ కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement