సాక్షి, కరీంనగర్: వివాదాస్పదమైన మాజీ ఏఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరోసారి దృష్టి సారించింది. అప్పుల కింద బాధితుల నుంచి భూములను స్వాధీనం చేసుకొని బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన కేసుల్లో రెండేళ్ల క్రితమే పలు అరెస్టులు జరిగాయి. వివిధ కేసుల్లో పలువురు నిందితులు రిమాండ్‌కు వెళ్లి వచ్చారు కూడా. నిందితులుగా ఉన్న బినామీలు ఒకటి రెండు కేసుల్లో ఏసీబీ మీదే ఎదురు తిరిగి కోర్టులను ఆశ్రయించడంతో అవినీతి నిరోధక శాఖ మళ్లీ కొరడా విదిల్చింది. గతంలో పరారీలో చూపించిన మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులను తాజాగా అరెస్టు చేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి కుమారుడు అక్షయ్‌రెడ్డి(క్రైం నెంబర్ 06/2018 కేసులో ఏ–3)ని, బుధవారం ఆయన తండ్రి బొబ్బల ఆదిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మోహన్‌రెడ్డి బినామీల నుంచి ఏసీబీ అధికారులు బాధితులకు భూములను, ఇతర ఆస్తులను వారికే తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా కొందరు బినామీలు ఏసీబీ అధికారులే బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఎదురు తిరుగుతుండడంతో ఏసీబీ మళ్లీ పంజా విసరుతోందని సమాచారం.
ఈ నెలలో నలుగురి అరెస్టు
భూకబ్జాలు, బినామీల పేరిట భూముల రిజిస్ట్రేషన్ తదితర కేసుల్లో ఈ నెలలోనే ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో మోహన్‌రెడ్డి బినామీల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ నెల 13న సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి, బాణాల రమణారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి కొడుకు బొబ్బల అక్షయ్‌రెడ్డిని మధ్యాహ్నం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మోహన్‌రెడ్డి తండ్రి బొబ్బల ఆదిరెడ్డి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తిమ్మాపూర్ కేసులో..
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్య భూ కబ్జా కేసులో 8 మంది నింది తులున్నారు. రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్యతోపాటు అతని వ్యాపార భాగస్వాములకు సంబంధించిన 30 గుంటల భూమిని, రూ.50 లక్షల విలువ చేసే కిన్నెర సారయ్యకు సంబంధించిన ఇళ్లను మోహన్‌రెడ్డి తదితరులు ఆక్రమించుకున్నారనేది ఫిర్యాదు. మోహన్‌రెడ్డి బినామీ అయిన శ్రీపాల్‌రెడ్డి మామ అమరం రాజిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని కిన్నెర సారయ్య 2018 ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేశారు. మోహన్‌రెడ్డి వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని అసలు, వడ్డీ చెల్లించినప్పుటికీ, తనఖా పెట్టిన భూమిని ఇతరుల పేరుమీదికి మార్చాడని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 మోహన్‌రెడ్డి కాగా, ఏ2 లత(మోహన్‌రెడ్డి భార్య), ఏ3 అక్షయ్‌రెడ్డి(మోహన్‌రెడ్డి కుమారుడు), ఏ4 మహేందర్‌రెడ్డి(మోహన్‌రెడ్డి తమ్ముడు), ఏ5 బొబ్బల ఆదిరెడ్డి(మోహన్‌రెడ్డి తండ్రి), ఏ6 శ్రీపాల్‌రెడ్డి(మోహన్‌రెడ్డి బావమరిది), ఏ7 బి.రమణారెడ్డి(మోహన్‌రెడ్డి సమీప బంధువు), ఏ8 అమరం రాజిరెడ్డి(శ్రీపాల్‌రెడ్డి మామ)లు నిందితులుగా పేర్కొన్నారు.
ఏసీబీ పైనే రివర్స్ నోటీసులు?
మోహన్‌రెడ్డి బినావీులపై 2017 చివరలో, 2018లో ఏసీబీ అధికారులు అరెస్టులు చేసి వారి వద్ద నుంచి బాధితులకు భూములను రిజిస్ట్రేషన్‌లు చేయించారు. మోహర్‌రెడ్డి బినామీల వద్ద నుంచి గత సంవత్సరం బా«ధితులకు ఏసీబీ రిజిస్ట్రేషన్లు చేయించింది. అప్పుడు మోహన్‌రెడ్డి, అతని బావమరిది శ్రీపాల్‌రెడ్డి ఇద్దరు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మోహన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డిలు బెయిల్‌పై విడుదలైన తర్వాత ఏసీబీ అధికారులు బినావీులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని మోహన్‌రెడ్డితోపాటు అతని బినామీలు కోర్టు ద్వారా ఏసీబీ వాళ్లకు నోటీసులు పంపించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ మళ్లీ బినావీులపై పంజా విసురుతోందని తెలుస్తోంది.
దాడి సుధాకర్ భూమి కేసులో సీన్ రివర్స్
దాడి సుధాకర్ అనే వ్యక్తికి సంబంధించిన భూమి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన సీహెచ్.రమణారెడ్డి అనే వ్యక్తి(మోహన్‌రెడ్డి బినావీు)కి గతంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కేసులో ఏసీబీ పోలీసులు సీహెచ్.రమణారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించి బాధితుడు దాడి సుధాకర్ భూమిని తిరిగి అతనికి ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. కాగా మోహన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత సీహెచ్.రమణారెడ్డిని సంప్రదించి దాడి సుధాకర్ వల్ల చాలా నష్టపోయామని, తిరిగి అతనిపై కేసు వేస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రమణారెడ్డితో న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులే బలవంతంగా రమణారెడ్డి వద్ద నుంచి దాడి సుధాకర్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులకే నోటీసులు పంపించినట్లు తెలిసింది. ఇలాగే మరికొందరు బినావీులతో కూడా కోర్టు ద్వారా నోటీసులు పంపించడంతో ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment