
అరెస్టు అయిన ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతి
నిజామాబాద్‌అర్బన్: లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. కల్లు బట్టి నుంచి శాంపిల్స్ సేకరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ ఇన్‌స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ స్రవంతిలను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్‌పల్లిలో పులి రాజాగౌడ్ కల్లుబట్టి నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ స్రవంతి కల్లు బట్టిపై దాడి చేసి, శాంపిల్స్ సేకరించారు. తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు గాను అధికారులు రాజాగౌడ్ నుంచి రూ.40 వేలు డిమాండ్ చేశారు.
డబ్బులు ఇవ్వకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో రాజాగౌడ్ రూ.30 వేలు ఇస్తానని అంగీకరించాడు. ఆ తర్వాత అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, సీఐ కార్యాలయాలను తనిఖీ చేశారు. మధ్యాహ్యం 2 నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కల్లు బట్టీ నిర్వాహకులను, ఎక్సైజ్ శాఖ అధికారులను విచారించారు. శాంపిల్స్ సేకరించిన తర్వాత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారా.. లేదా అన్న దానిపై విచారణ జరిపారు. శాంపిల్స్ సేకరించి తమ వద్దే ఉంచుకున్నట్లు వెల్లడైందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ సంబంధించి గతంలో జరిగిన తనిఖీలు, వివిధ విషయాలపై విచారణ అనంతరం లంచం డిమాండ్ నేరం కింద టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్‌ఇన్‌స్పెక్టర్ స్రవంతిలను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment