ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు | ACB operation to arrest ten more in ESI Scam Case | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు

Published Mon, Jun 29 2020 3:20 AM | Last Updated on Mon, Jun 29 2020 4:37 AM

ACB operation to arrest ten more in ESI Scam Case - Sakshi

సాక్షి, అమరావతి:  ఈఎస్‌ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఏసీబీ అచ్చెన్నాయుడు సహా 9 మందిని అరెస్ట్‌ చేసింది. టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కాల్‌ సెంటర్, ఈసీజీ సేవల్లో జరిగిన దోపిడీపై ఒక కేసు.. మందులు, పరికరాలు, వైద్య సామగ్రి కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాలపై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితుల్ని అరెస్ట్‌ చేసేందుకు ఏసీబీ ఆచితూచి అడుగులు వేస్తోంది. 

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ల నుంచి ఆశాజనక సమాచారం 
► కుంభకోణం వెనుక చీకటి కోణాలను గుర్తించిన ఏసీబీ కీలక విషయాలను రాబట్టేందుకు అచ్చెన్నను 3 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది. 
► విచారణకు అచ్చెన్నను సహకరించకుండా దాటవేత ధోరణి అవలంబించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లతోపాటు పలువుర్ని 2 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన ఏసీబీకి ఆశాజనకమైన సమాచారం వచ్చినట్టు తెలిసింది.  
► ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వి.జనార్దన్, సూపరింటెండెంట్‌ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇవన రమేష్‌లను ఏసీబీ లోతుగా ఆరా తీసినట్టు సమాచారం.  
► కుంభకోణంలో తమ పాత్రను నర్మగర్భంగా అంగీకరించిన మాజీ డైరెక్టర్లు, కొందరు ఉద్యోగులు.. ఇదంతా అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో చేశామనే విషయాన్ని గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. 
► వారిచ్చిన కీలక సమాచారం అచ్చెన్నతోపాటు మిగిలిన వారికీ బలంగా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.  
► స్కామ్‌లో ఎవరి పాత్ర ఉంది? ఎవరి వాటా ఎంత? అనే కోణాల్లో కొంత క్లారిటీకి వచ్చిన ఏసీబీ మరింత ముందుకు సాగేందుకు నిర్ణయించింది.  
► ఇప్పటికే ఏసీబీ సేకరించిన సమాచారం, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదిక, కస్టడీలో నిందితులు ఇచ్చిన వివరాలను క్రోఢీకరించుకుని కార్యాచరణ చేపట్టనుంది.  
► నిందితులందరినీ అరెస్ట్‌ చేసిన తర్వాత వారినుంచి మరింత కీలక సమాచారం రాబట్టి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మిగిలిన వారి ఆట కట్టించేందుకు ఏసీబీ స్కెచ్‌ వేసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.  
► టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ప్రమోద్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ఏసీబీ బృందాలు హైదరాబాద్, కోదాడ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.  
► ఏపీ సచివాలయంలో టీడీపీ హయాంలో చేతివాటం ప్రదర్శించిన ఓ ఉద్యోగి గురించి ఏసీబీ ఆరా తీస్తోంది. ఆ ఉద్యోగిని అరెస్ట్‌ చేసి విచారిస్తే మరికొందరి కీలక వ్యక్తుల బాగోతం బయటకు వస్తుందంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement