అనంతపురంలోని కానిస్టేబుల్ రవీంద్రనాథ్‌రెడ్డి ఇల్లు , అనంతలో ఏసీబీ సోదాలు
కిలో బంగారం.. 3.5 కిలోల వెండి వస్తువులు.. రూ.14 లక్షల విలువైన గృçహోపకరణాలు.. అనంతపురం, తాడిపత్రిలో భవనాలు..14 చోట్ల స్థలాలు.. నాలుగు చోట్ల 24 ఎకరాల వ్యవసాయ భూమి.. ఈ ఆస్తులన్నీ ఓ కానిస్టేబుల్ సంపాదించినవంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. ఏసీబీ దాడుల్లో ఈ నిజం వెలుగు చూసింది.
అనంతపురం సెంట్రల్/ పుట్లూరు/ యల్లనూరు: గుంతకల్లు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవీంద్రనాథరెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు సోదాలు చేపట్టారు. అనంతపురంలోని కానిస్టేబుల్ నివాసంలో డీఎస్పీ జయరామరాజు, సీఐలు ప్రతాప్‌రెడ్డి, కర్నూలు సీఐ ఖాదర్‌బాషా, యల్లనూరులోని గిరమ్మబావి గ్రామంలో ఉంటున్న బంధువులు రమేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి ఇళ్లలో కర్నూలు సీఐ నాగభూషణం, తేజేశ్వరరావు, పుట్లూరులో కానిస్టేబుల్ సోదరులు చంద్రశేఖరరెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇళ్లల్లో కర్నూలు సీఐలు చక్రవర్తి, శ్రీధర్‌లతో ఏసీబీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం నాటికి దాదాపు రూ.3.50 కోట్ల ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ. 20కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశముందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆ శాఖ అధికారులకు సిఫారసు చేస్తామని వివరించారు.
ఉలిక్కిపడిన ఆర్టీఓ అధికారులు
కానిస్టేబుల్ రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో రవాణాశాఖ ఉద్యోగుల్లో ప్రకంపనలు రేగాయి. రవాణాశాఖలో గతంలో అవినీతి, అక్రమాలు భారీ స్థాయిలో వెలుగుచూశాయి. తాజాగా కానిస్టేబుల్ ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేలడంతో మిగిలిన అవినీతి ఉద్యోగుల గుండ్లెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూడేళ్లకోసారి కానిస్టేబుల్ ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆర్టీఏలో ఈ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవినీతిలో అందరికీ వాటాలుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నాడంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment