
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యతో తనకు సంబంధం లేదని, హనీ ట్రాప్‌చేసి అతన్ని తీసుకొచ్చాననేది కూడా అవాస్తవమని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. శనివారం శ్రీనగర్ కాలనీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్టులో తన పేరు ఉండటంతో పోలీసులు విచారణకు పిలిచారని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. రాకేశ్‌తో తనకు సంబంధం ఉన్నది వాస్తవమేనన్నారు.
తాను తీసిన కలియుగ సినిమా ప్రమోషన్‌కు రూ.25 లక్షలు అవసరం ఉండటంతో ఓ ఫ్రెండ్ ద్వారా రాకేశ్‌ను కలసి డబ్బులు బదులివ్వాలని అడిగానన్నారు. అందుకు అతను ఒప్పుకున్నాడని, దీని కోసం ఆ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఇచ్చేందుకు అంగీకరించానన్నారు. ఆ డబ్బుల కోసం జనవరి 31న డబ్బులు ఇస్తానంటే వెళ్లినట్లు చెప్పారు. ఇప్పటివరకు శిఖా చౌదరిని చూడలేదన్నారు. జయరాం హత్య జరిగిన విషయాన్ని ఫిబ్రవరి 3న మీడియాలో చూసి షాక్ తిన్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు రాకేశ్‌తో పాటు ఆయన స్నేహితులకు కలియుగ సిని మాను ఇంట్లోనే హోం థియేటర్‌లో చూపించానని వెల్లడించారు. ఈ ఆరోపణలతో తన కుటుంబ సభ్యులు కలత చెందుతున్నారని, బంధువులు, స్నేహితులు సూటిపోటి మాటలతో మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.