సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కె.రాకేశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేసి, ఆరోపణలు ఉన్న పోలీసులను అరెస్టు చేయకపోవడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయా అధికారుల పాత్రలపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది.
♦ జయరాం మృతదేహాన్ని కారులో ఉంచుకున్న రాకేష్‌రెడ్డి తన స్నేహితుడైన అప్పటి నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును కలవడానికి ఆ ఠాణాకు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయనతో పాటు అప్పటి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని సంప్రదించాడు.
♦ వీరిద్దరూ ఇచి్చన సలహా మేరకు ఈ హత్యను డ్రంక్ డ్రైవింగ్ నేపథ్యంలో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేసి ఏపీలోని నందిగామకు తీసుకువెళ్లాడు. అక్కడ హైవే పక్కనే కారుతో సహా శవాన్ని వదిలేసి తిరిగి వచ్చాడు.
♦ మొత్తమ్మీద హత్య తర్వాత ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులుతో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు సంభాషించినట్లు రాకేష్ కాల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరితో పాటు అప్పట్లో రాయదుర్గం ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన రాంబాబుతోనూ రాకేష్‌రెడ్డి సంప్రదింపులు జరిపాడు.
♦ నందిగామలో రిజిస్టర్ అయిన ఈ కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయింది. ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని గత ఏడాది ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపై అతడికి సహకరించిన మరో ఏడుగురు నిందితులను జైలుకు పంపారు.
♦ రాకేశ్‌రెడ్డితో పాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.
♦ వీరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు సైతం ఉన్నారు. అయితే వీరిని పోలీసులు అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు మాత్రమే జారీ చేశారు.
♦ అదేమంటే కేసులో వీరి పాత్ర చాలా స్వల్పమంటూ చెప్పి అరెస్టు చేయకుండానే తతంగం పూర్తి చేశారు. సాధారణంగా ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో నిందితులు అందరినీ అరెస్టు చేస్తారు. వారి పాత్రలను బట్టి ఆయా సెక్షన్ల కింద అభియోగపత్రాలు దాఖలు చేస్తారు.
♦ జయరాం కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల విషయంలో మాత్రం హైదరాబాద్ పోలీసులు ఇలా చేయలేదు. దీన్నే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
♦ గత ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రోడ్ నెం.10లోని తన ఇంటికి రప్పించాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయన్ను నిర్బంధించి, ఆ మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేశాడు.
♦ ఈ కేసులో పోలీసుల పాత్రపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాఖలయ్యే కౌంటర్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశమే ఇప్పుడు పోలీసులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment