Surya Prasad
-
ఏపీ మంత్రులతో రాకేష్‌కు లింకులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, ప్రవాసభారతీయుడు చిగురుపాటి జయరామ్‌ను హత్యచేసిన రాకేష్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మంత్రులతో సంబంధాలున్నాయని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జయరామ్ హత్యానంతరం హంతకుడు అక్కడి అమాత్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తేలిందన్నారు. కేసు దర్యాప్తులో ఏపీ మంత్రులతో ఉన్న పరిచయ కోణాన్నీ పరిగణనలోకి తీసుకుని లోతుగా ఆరా తీస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన సందర్భంగా గురువారం విలేకరుల సమా వేశం ఏర్పాటుచేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం. 10లో ఉన్న రాకేష్ ఇంట్లో జనవరి 31న జయరామ్ హత్య జరిగిన విషయం విదితమే. మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లిన రాకేష్ ఏపీలోని నందిగామ సమీపంలో వదిలిపెట్టి వచ్చారు. తొలుత ఏపీలో నమోదైన ఈ కేసు.. ఆపై తెలంగాణకు బదిలీ కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి జయరామ్ హత్యకు ముందు, ఆ తర్వాతా ఏపీ మంత్రులతో మాట్లాడాడు. అయితే హత్యకు సంబంధించిన వివరాలు మాట్లాడారా? మరేదైనా చర్చించారా? అనేది దర్యాప్తులో తేలుతుందని డీసీపీ తెలిపారు. రాకేష్ కాల్ డిటేల్స్ అధ్యయనం చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు, ఆ పార్టీ కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలిందని పేర్కొన్నారు. 4 నెలల క్రితమే ప్లానింగ్! ఆర్థిక వివాదాల నేపథ్యంలో జయరామ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న రాకేష్.. ఈ ఘాతుకానికి 4 నెలల క్రితమే ప్లాన్ చేశాడు. జయరామ్ వ్యవహార శైలి తెలిసిన రాకేష్ కొత్త సిమ్‌కార్డు తీసుకుని హనీట్రాప్‌ను వీణ పేరుతో అమలుచేశాడు. జయరామ్‌ను ‘జై’అని పిలుస్తూ వాట్సాప్ చాటింగ్ చేశాడు. వీరి మధ్య మొత్తం 170 చాటింగ్స్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జయరామ్‌ను నిర్భంధించాలని కుట్రపన్నిన రాకేష్.. జనవరి 30న వీణ పేరు తో లంచ్‌కు ఆహ్వానించాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌కు వస్తే అక్కడ నుంచి కలిసి వెళ్దామంటూ వాట్సాప్ సందేశం పెట్టాడు. అతడు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రౌడీషీటర్ నగేష్‌ను రమ్మని పిలిచాడు. ఓ వ్యక్తిని నిర్బంధించి డబ్బు వసూలు చేద్దామన్నాడు. దీనికోసం విశాల్ (నగేష్ సమీప బంధువు)నూ లైఫ్‌సెటిల్ చేస్తానంటూ తనతో కలుపుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న చిలకట్ల సూర్యప్రసాద్ (30) అలియాస్ సూర్య తాను నిర్మిస్తున్న కలియుగ సినిమా కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం రాకేష్‌ను ఆశ్రయించాడు. జనవరి 30న రాకేష్‌ను కలిసేందుకు అతడి ఇంటికి వస్తూ తన స్నేహితుడైన ‘కలియుగ’అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్‌ను తీసుకువచ్చాడు. దీంతో నగేష్, విశాల్‌లను ఇంట్లోనే ఉంచిన రాకేష్.. వీరిద్దరినీ తీసుకుని బయలుదేరాడు. జూబ్లీహిల్స్ క్లబ్ వరకు వచ్చాక జయరామ్ కారు నంబర్ కిశోర్‌కు చెప్పి అతడికి అక్కడ దింపేశాడు. అందులో జై అనే వ్యక్తి వస్తారని, అతడిని వీణ మేడం డ్రైవర్ని అంటూ పరిచయం చేసుకుని, అతడి కారులోనే తన ఇంటికి తీసుకురమ్మని రాకేష్ చెప్పడంతో కిశోర్ అలానే చేశాడు. ఇంటికి వచ్చాక సూర్య, కిశోర్‌లు కింది నుంచే వెళ్లిపోగా.. రాకేష్ సహా మిగిలిన ఇద్దరూ జయరామ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. స్టాంపు పేపర్లపై సంతకాలు జయరామ్‌ను బెదిరించిన రాకేష్ కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు (జనవరి 31) విశాల్‌తో కలిసి జయరామ్‌ను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. జయరామ్ దేహం ఇంట్లో ఉండగానే రియల్టర్ అంజిరెడ్డి ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విషయం మాట్లాడటానికి అక్కడకు వచ్చాడు. చింతల్లో కేబుల్ వ్యాపారం కూడా చేస్తున్న అంజిరెడ్డి.. ఇంట్లో రాకేష్ మృతదేహం చూసి భయపడ్డాడు. తిరిగి వెళ్తున్న అంజిరెడ్డికి.. జయరామ్ నుంచి సంతకాలు తీసుకున్న ఖాళీ పత్రాలను రాకేష్ ఇచ్చి పంపాడు. ఇలా జయరామ్ కేసులో అంజిరెడ్డి, సూర్య, కిశోర్ నిందితులుగా మారారని డీసీపీ శ్రీనివాస్ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. జయరామ్ మేనకోడలు శిఖాచౌదరికి ఈ హత్యతో సంబంధం లేదన్న డీసీపీ.. జయరామ్ భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు ఆమెపై నమోదైన కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను విచారించామని.. వారిచ్చిన సమాధానాల ఆధా రంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. గతంలో ప్రగతి రిసార్ట్స్ యజమానిని బెదిరించి బలవంతంగా భూమిని రాయించుకున్న రాకేష్ అప్పట్లో పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భయపెట్టించారని డీసీపీ చెప్పారు. చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తు పూర్తికావస్తోందని, 15 రోజుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామని తెలిపారు. తెలిసి తప్పు చేయలేదు జయరామ్ హత్య కేసులో గురువారం అరెస్టు అయిన సినీ నటుడు సూర్య విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని ఈ వీడియోలో సూర్య తెలిపాడు. 47 సెకన్ల నిడివితో ఉన్న ఆ వీడియోలో.. ‘హలో అండి నా పేరు సూర్య. ఈ రాకేష్‌రెడ్డి, శిఖా చౌదరి, చిగురుపాటి జయరామ్ కేసులో మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. యాక్చువల్లీ రాకేష్ నాకు ఫోన్ చేసినప్పుడు కిశోర్ నా పక్కనే ఉన్నాడు. కిశోర్ నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్. నేను మహా అయితే రాకేష్‌ను నాలుగైదుసార్లు కలిశానంతే. కిశోర్ తన పనిలో ఉంటే నేనే అతడికి తీసుకెళ్లాను. ఇక్కడే అన్న పిలిచాడు అంటూ చెప్పి వెళ్లొద్దామని చెప్పి వెళ్లాం. తర్వాత రాకేష్‌రెడ్డి అన్నవాడు మమ్మల్ని ఎలా వాడుకున్నాడో మీకు తెలిసిందే. కిశోర్‌కు డ్రైవింగ్ కూడా రాదు. నేను పిలవడం వల్లే వచ్చాడు. సో.. ప్లీజ్! తెలిసైతే మేము తప్పు చేయలేదు. ప్లీజ్ వీలైతే హెల్ప్ చెయ్యండి’అని అభ్యర్థించాడు. – సూర్య సెల్ఫీ వీడియో -
శిఖా చౌదరికి ఎలాంటి సంబంధం లేదు...
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురుని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ జయరాం హత్యకేసులో వీరి పాత్ర గురించి వివరించారు. జయరామ్‌ను హత్య చేసిన అనంతరం టీడీపీ మంత్రులకు రాకేష్ రెడ్డి ఫోన్ చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. అయితే వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. రాకేష్ రెడ్డి ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తామని.. మరో 15 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నారు. కాగా మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేశారు. (ఏపీకి చెందిన ఎవరా మంత్రి!?) చీటింగ్ కింద కేసు నమోదు ‘జయరామ్ హత్యకేసులో సూర్య, కిషోర్, అంజిరెడ్డిలు కీలక పాత్ర పోషించారు. కిషోర్ అనే వ్యక్తి హానీ ట్రాప్ చేసి జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చారు. వీణ అనే అమ్మాయి పేరు చెప్పి జయరామ్‌ను తీసుకరావాలని సూర్య, కిషోర్‌లకి రాకేష్ రెడ్డి ఆదేశించాడు. దీంతో జయరాంను రాకేష్ రెడ్డిని ఇంటికి తీసుకెళ్లారు. వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశాము. హత్య విషయం ముందే తెలిసినా పోలీసులకు అంజిరెడ్డి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా రాకేష్ రెడ్డి జయరాం వద్ద బలవంతంగా సంతకాలు తీసుకున్న పత్రాలను అంజిరెడ్డి తీసుకెళ్లాడు. శిఖా చౌదరికీ ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధంలేదు. ఆంధ్ర రాజకీయ నాయకులకి రాకేష్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, రాజకీయం నాయకుల పేర్లు చెప్పి అందరినీ బయపెట్టడం రాకేష్ రెడ్డికి అలవాటు’అంటూ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. (జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్) మమ్మల్ని వాడుకొని మోసం చేశాడు జయరాం హత్యకేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య గురువారం మీడియాకు తెలిపారు. కిషోర్‌తో తనకు ఐదేళ్ల నుంచి మంచి స్నేహితుడని, తాను చెప్పడం వల్లే కిషోర్ తనతో రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. అంతకముందు రాకేష్ రెడ్డిని ఐదు సార్లు కలిశానన్నారు. తమను వాడుకొని రాకేష్ రెడ్డి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. -
జయరామ్‌ను హనీట్రాప్ చేయలేదు
-
జయరాం హత్య కేసులో సినీనటుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్ సహకరించడంపై విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. -
జయరాం హత్యతో సంబంధం లేదు
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యతో తనకు సంబంధం లేదని, హనీ ట్రాప్‌చేసి అతన్ని తీసుకొచ్చాననేది కూడా అవాస్తవమని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. శనివారం శ్రీనగర్ కాలనీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్టులో తన పేరు ఉండటంతో పోలీసులు విచారణకు పిలిచారని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. రాకేశ్‌తో తనకు సంబంధం ఉన్నది వాస్తవమేనన్నారు. తాను తీసిన కలియుగ సినిమా ప్రమోషన్‌కు రూ.25 లక్షలు అవసరం ఉండటంతో ఓ ఫ్రెండ్ ద్వారా రాకేశ్‌ను కలసి డబ్బులు బదులివ్వాలని అడిగానన్నారు. అందుకు అతను ఒప్పుకున్నాడని, దీని కోసం ఆ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఇచ్చేందుకు అంగీకరించానన్నారు. ఆ డబ్బుల కోసం జనవరి 31న డబ్బులు ఇస్తానంటే వెళ్లినట్లు చెప్పారు. ఇప్పటివరకు శిఖా చౌదరిని చూడలేదన్నారు. జయరాం హత్య జరిగిన విషయాన్ని ఫిబ్రవరి 3న మీడియాలో చూసి షాక్ తిన్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు రాకేశ్‌తో పాటు ఆయన స్నేహితులకు కలియుగ సిని మాను ఇంట్లోనే హోం థియేటర్లో చూపించానని వెల్లడించారు. ఈ ఆరోపణలతో తన కుటుంబ సభ్యులు కలత చెందుతున్నారని, బంధువులు, స్నేహితులు సూటిపోటి మాటలతో మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందుకే రాకేష్‌రెడ్డిని కలిశా: నటుడు
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. హానీ ట్రాప్ చేసి జయరామ్‌ను తీసుకొచ్చారనేది అవాస్తవమని ‘సాక్షి’ టీవీతో చెప్పారు. జనవరి 28 నుండి 31 వరకు రాకేష్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్‌లో తన నంబర్ ఎక్కువగా ఉండటం కారణంగానే తనను పోలీసులు విచారణకు పిలిచారని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నిటికి తాను సమాధానం చెప్పానన్నారు. రాకేష్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, తన సినిమా ప్రమోషన్ కోసమే అతడిని కలిసినట్టు వెల్లడించారు. (జయరాం హత్య జరగ్గానే ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్) ఇప్పటివరకు శిఖా చౌదరిని తాను చూడలేదు, మాట్లాడలేదన్నారు. జయరామ్ హత్య జరిగిన విషయం మీడియాలో చూసి తాను షాక్ అయ్యానన్నారు. హానీ ట్రాప్‌లో తాను ఉన్నాను అన్నప్పుడు బాధ కలిగించిందన్నారు. ‘మీ భర్త హత్య కేసులో నా ప్రేమయం లేదు నమ్మండి’ అంటూ జయరామ్ భార్య పద్మశ్రీని వేడుకున్నారు. తాను నటించిన ‘కలియుగ’ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు సమకూరుస్తాను అంటేనే నేను రాకేష్ రెడ్డిని నమ్మినట్టు చెప్పారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచిన సహకరిస్తానని సూర్య అన్నారు. రాకేష్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని కోరాడు. (రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా) -
ఇదేంది బాస్
జూనియర్ల వద్ద సీనియర్ల కొలువు {పొబేషనరీ ఎస్సైలకు ఎస్హెచ్ఓ స్థానాలు సీనియర్లకు సెకండ్ ఎస్సైగా డిమోషన్ పోలీస్‌శాఖలో హాట్‌టాపిక్‌గా పీఎస్సై పోస్టింగ్‌లు అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత సబ్ ఇన్స్పెక్టర్లు నిన్నటి వరకు వారందరూ సీనియర్ ఎస్సైల వద్ద వృత్తిలో శిక్షణ పొందిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నుంచి కేసు దర్యాప్తు వరకు అనేక విషయూలను సీనియర్ల వద్ద ఉండి నేర్చుకున్నారు. సీనియర్లు ఆదేశించగానే ‘ఎస్ సర్’ అని సెల్యూట్ చేస్తూ గౌరవించారు. పోలీస్ బాస్‌ల నిర్ణయం పుణ్యమా.. అని తాజా పరిస్థితి తారుమారైంది. ప్రొబేషనరీ ఎస్సైలకు సీనియర్లే సెల్యూట్ చేయూల్సిన వింత పరిస్థితి ఏర్పడింది. ఇది తమను అవమానించడమేనని, ఆత్మగౌరవాన్ని గాయపరచడమేనని సీనియర్లు వాపోతున్నారు. వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల(పీఎస్సై)ల పోస్టింగ్‌లు వివాదాస్పదమవుతున్నాయి. సీనియారిటీని విస్మరించి కొత్తగా శిక్షణ తీసుకున్న పీఎస్సైలకు ఎస్హెచ్ఓ స్థానాలు కల్పించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న సీనియర్లను అదేస్థానంలో ఉంచి.. కొత్తగా శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన వారికి ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. 2013 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి తాజాగా రూరల్‌లో 27 మందికి, అర్బన్ పరిధిలో ఆరుగురికి శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఇచ్చిన పోస్టింగ్ ప్రాధాన్యతే ఇక్కడ తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆయూ స్థానాల్లో ఎస్సై లుగా కొనసాగుతున్న వారిని డిమోట్ చేసి వారి స్థానంలో ప్రొబేషనరీ ఎస్సైలను నియమించారు. 2002, 2007, 2009 బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు పనిచేస్తున్న స్థానాలకు 2013 బ్యాచ్ ఎస్సైలను పంపించారు. వారి వద్ద సీనియర్లు సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ అందుకున్న కొందరు ఎస్సైలను ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడంతోపాటు వారి కిందే అక్కడే పని చేయాలని సీనియర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. నిన్నగాక మొన్న శిక్షణ పూర్తిచేసుకున్న వారు చెప్పినట్లు ఇకపై సీనియర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి న్యాయం ప్రపంచంలో ఎక్కడా ఉండదని పలువురు ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తికాకుండానే... ప్రస్తుతం పోస్టింగ్‌లు పొందిన ఎస్సైలకు ప్రొబేషనరీ డిక్లేర్ కావడానికి ఇంకా 18 నెలల సమయం ఉంది. వీరంతా 13 నెలలు హైదరాబాద్ అప్పాలో శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ కాలం ప్రొబేషనరీ పిరియడ్‌లోకి రాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 6 నెలలపాటు ఇక్కడ శిక్షణ ఉంటుది. ఈ సమయంలో వారు కానిస్టేబుల్‌గా, హెడ్‌కానిస్టేబుల్‌గా, ఏఎస్సైగా పలు విభాగాల్లో పనిచే యాల్సి ఉంటుంది. ఈ ఆరు నెలల కాలం కలిపితే మరో 18 నెలలు ఇంకా ప్రొబేషనరీ కాలం ఉంటుంది. ఈ కాలం పూర్తయితే సర్వీసు పరంగా వీరికి అన్ని కౌంటింగ్‌లోకి వస్తాయి. ఈ ప్రొబేషనరీ సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఏమైనా తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం నుంచే డిస్మిస్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇదెక్కడి న్యాయం.. అర్బన్ పరిధిలో ఆరుగురు పీఎస్సైలను మామునూరు, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, జఫర్‌గఢ్ పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్ ఇచ్చారు. అయా స్థానాల్లో పనిచేస్తున్న వారంతా సెకండ్ ఎస్సైలుగా కొనసాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రూరల్ పరిధిలో మరిపెడ పీఎస్ ఎస్సై జె.వెంకటరత్నం, చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, చేర్యాల ఎస్సై సూర్యప్రసాద్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్సైలకు బాధ్యతలు అప్పగించి అక్కడే సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలి. నర్సింహులపేట ఎస్సై వై. వెంకటప్రసాద్ ఏటూరునాగారం బదిలీ అయ్యూరు. ఆయన కూడా తన వద్ద శిక్షణ పొంది ఏటూరునాగారం పీఎస్ ఎస్సైగా పోస్టింగ్ పొందిన రవీందర్ వద్ద సెకండ్ ఎస్సైగా పనిచేయూల్సి ఉంది. పదేళ్ల సీనియూరిటీ కలిగిన చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, మామూనూరు ఎస్సై సత్యనారాయణ సైతం తాము పనిచేసే స్టేషన్లలోనే సెకండ్ ఎస్సైలుగా డిమోట్ అయ్యూరు. ఆవేదన చెందుతున్న సీనియర్లు జూనియర్లు వస్తే సీనియర్లకు పదోన్నతి ఉండాలిగానీ అందుకు విరుద్ధంగా డిమోట్ చేయడం చర్చనీయూంశంగా మారింది. అనుకోని విధంగా ఉత్తర్వులు రావడంతో బాధిత ఎస్సైలు కలత చెందుతున్నారు. జూనియర్ల వద్ద తమను సెకండ్ ఎస్సైలుగా పనిచేయించడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆవేదన చెందుతున్నారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి తమను బలిచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే తమను వీఆర్లోనో, ఉన్నతాధికారులకు అటాచ్డ్గానో నియమించినా బాగుండేదని వాపోతున్నారు. శాఖాపరంగా తప్పులు చేసిన వారికి మాత్రమే.. ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తారని కాని తాము ఎలాంటి తప్పుడు విధానాలు అవలంభించకున్నా తమకు ఈ శిక్ష ఎందుకు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. -
బీమాతోనే కొబ్బరి కార్మికులకు ధీమా
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :ఉభయగోదావరి జిల్లాల్లో కొబ్బరి కార్మికులు బీమా వైపు అడుగువేస్తే భరోసా ఏర్పడి ధీమాగా ఉండొచ్చని రాష్ట్ర కార్మికశాఖ అదనపు కమిషనర్ వై.సూర్యప్రసాద్ అన్నారు. కార్మికులకు అండగా నిలుస్తూ ఇటీవల అమల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం వారిని ఆపద్బంధువులా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని దాదాపు 45 వేల కొబ్బరి కార్మికులను సామాజిక భద్రతా చట్టం 2008 ప్రకారం ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో నమోదు చేసేందుకు కొబ్బరి కార్మిక వ్యవస్థను పెలైట్ ప్రాజెక్టుగా కార్మికశాఖ ఎంపిక చేసింది. అమలాపురంలోని వెండి బంగారు వర్తకుల సంఘం భవనంలో ఉభయగోదావరి జిల్లాల కొబ్బరి కార్మికులతో శనివారం సాయంత్రం జరిగిన చర్చకు అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. సామాజిక భద్రత చట్టం ప్రకారం ఏరంగంలో కార్మికులకైనా సామాజిక భద్రత కల్పించాల్సి ఉందని సూర్యప్రసాద్ చెప్పారు. ఈ బీమాలో కార్మికులు ఏటా రూ.100 చెల్లిస్తే మరో రూ.100 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రానున్న ఏడాదిలో కార్మికుడు చెల్లించే రూ.100లో కొంత ప్రభుత్వం చెల్లించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కొబ్బరి కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పథకంలోని కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75వేలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.75వేలు, సహజ మరణానికి రూ.30వేలు, 50శాతం అంగవైకల్యానికి రూ.37,500 బీమాగా అందుతుందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని నాలుగు జిల్లాల్లో ఐదు కేటగిరిల కార్మిక వ్యవస్థలను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. విజయవాడలో ఆటో కార్మికులకు, హైదరాబాద్‌లో ఇంటి పని కార్మికులు, కూలీలను, విశాఖపట్నంలో వీధి కార్మికులను, తూర్పుగోదావరిలో కొబ్బరి కార్మికులను పెలైట్ ప్రాజెక్టులుగా తీసుకున్నామన్నారు. ఆయా కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు కార్మికశాఖ చేపడుతోందన్నారు. ఏలూరు కార్మికశాఖ జాయింట్ కమిషనర్ ఎంఎల్ వరహాల రెడ్డి, కార్మిక భద్రతా మండలి సభ్యుడు ఎంఎల్‌వి ప్రసాద్, ఏలూరు కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఇ.రఘురామయ్య, రాష్ట్ర కొబ్బరి కార్మికుల సంఘ అధ్యక్షుడు గళ్లా రాము, కొబ్బరి కార్మిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డేపల్లి నాగేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల కొబ్బరి వ్యాపారుల సంఘ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, సీఐటీయూ నాయకుడు ఎం.రాజశేఖర్ ప్రసంగించారు. ఆమ్ఆద్మీ బీమా యోజన పథకంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కొబ్బరి కార్మికులు కమిషనర్‌కు తెలిపారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్లు వై.కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పి.లక్ష్మీనారాయణ, సహాయ కార్మికశాక అధికారులు డీబీటీ సుందరి, గోదావరి కేశవరావు, సీహెచ్‌వీ సుబ్బారావు, పీఎస్ఎస్ బంగార్రాజు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.