బీమాతోనే కొబ్బరి కార్మికులకు ధీమా
Published Sun, Dec 15 2013 4:33 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :ఉభయగోదావరి జిల్లాల్లో కొబ్బరి కార్మికులు బీమా వైపు అడుగువేస్తే భరోసా ఏర్పడి ధీమాగా ఉండొచ్చని రాష్ట్ర కార్మికశాఖ అదనపు కమిషనర్ వై.సూర్యప్రసాద్ అన్నారు. కార్మికులకు అండగా నిలుస్తూ ఇటీవల అమల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం వారిని ఆపద్బంధువులా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని దాదాపు 45 వేల కొబ్బరి కార్మికులను సామాజిక భద్రతా చట్టం 2008 ప్రకారం ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో నమోదు చేసేందుకు కొబ్బరి కార్మిక వ్యవస్థను పెలైట్ ప్రాజెక్టుగా కార్మికశాఖ ఎంపిక చేసింది. అమలాపురంలోని వెండి బంగారు వర్తకుల సంఘం భవనంలో ఉభయగోదావరి జిల్లాల కొబ్బరి కార్మికులతో శనివారం సాయంత్రం జరిగిన చర్చకు అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. సామాజిక భద్రత చట్టం ప్రకారం ఏరంగంలో కార్మికులకైనా సామాజిక భద్రత కల్పించాల్సి ఉందని సూర్యప్రసాద్ చెప్పారు. ఈ బీమాలో కార్మికులు ఏటా రూ.100 చెల్లిస్తే మరో రూ.100 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
రానున్న ఏడాదిలో కార్మికుడు చెల్లించే రూ.100లో కొంత ప్రభుత్వం చెల్లించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కొబ్బరి కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పథకంలోని కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75వేలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.75వేలు, సహజ మరణానికి రూ.30వేలు, 50శాతం అంగవైకల్యానికి రూ.37,500 బీమాగా అందుతుందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని నాలుగు జిల్లాల్లో ఐదు కేటగిరిల కార్మిక వ్యవస్థలను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. విజయవాడలో ఆటో కార్మికులకు, హైదరాబాద్‌లో ఇంటి పని కార్మికులు, కూలీలను, విశాఖపట్నంలో వీధి కార్మికులను, తూర్పుగోదావరిలో కొబ్బరి కార్మికులను పెలైట్ ప్రాజెక్టులుగా తీసుకున్నామన్నారు. ఆయా కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు కార్మికశాఖ చేపడుతోందన్నారు.
ఏలూరు కార్మికశాఖ జాయింట్ కమిషనర్ ఎంఎల్ వరహాల రెడ్డి, కార్మిక భద్రతా మండలి సభ్యుడు ఎంఎల్‌వి ప్రసాద్, ఏలూరు కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఇ.రఘురామయ్య, రాష్ట్ర కొబ్బరి కార్మికుల సంఘ అధ్యక్షుడు గళ్లా రాము, కొబ్బరి కార్మిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డేపల్లి నాగేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల కొబ్బరి వ్యాపారుల సంఘ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, సీఐటీయూ నాయకుడు ఎం.రాజశేఖర్ ప్రసంగించారు. ఆమ్‌ఆద్మీ బీమా యోజన పథకంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కొబ్బరి కార్మికులు కమిషనర్‌కు తెలిపారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్లు వై.కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పి.లక్ష్మీనారాయణ, సహాయ కార్మికశాక అధికారులు డీబీటీ సుందరి, గోదావరి కేశవరావు, సీహెచ్‌వీ సుబ్బారావు, పీఎస్‌ఎస్ బంగార్రాజు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement