సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయకపోవడంపై అలహాబాద్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉనావోలో యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదైన ఇప్పటివరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వానికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశామని త్వరలోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం కోర్టుకి నివేదించినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో తీర్పును శుక్రవారం వెలువరించనుంది. బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే మరోవైపు డీజీపీ మాట్లాడుతూ.. కేసు సీబీఐకి అప్పగించినందున మళ్లీ కొత్తగా కేసు నమోదుచేసిన తర్వాతే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయగలమని తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆయన విచారణను ప్రభావితం చేస్తారని అన్నారు. తన తండ్రిని చంపేశారని, ఇప్పుడు తన కోసం పోరాడుతున్న తన బాబాయి జీవితం గురించి భయపడుతున్నానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తోపాటు, ఆయన సోదరుడిపై చర్యలు చేపట్టాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట యువతి బంధువులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment