సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
(చదవండి : మారుతీ రావు షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?)
మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ.కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో దారుణంగా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హత్య జరిగింది. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ కేసులోమారుతీరావు జైలుపాలయ్యారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపారు. కాగా, ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా వారం రోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావుకు చెందిన షెడ్డులో అనుమానాస్పదస్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో లభించింది. జైలు నుంచి విడుదలైన తరువాత మారుతీరావు ఎవరికి, ఎక్కడా పెద్దగా తారసపడకపోవడంతో చనిపోయింది మారుతీరావే అన్నట్లు ప్రచారాలు జరిగాయి. ఈ ఘటనలో మృతదేహం ఎవరిదన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment