అంతా ఆన్‌లైన్‌లోనే..!! | Arrest Of Foreigner Accused In Drug Case In Guntur Sensational | Sakshi
Sakshi News home page

అంతా ఆన్‌లైన్‌లోనే..!!

Published Sun, Nov 24 2019 7:59 AM | Last Updated on Sun, Nov 24 2019 8:45 AM

Arrest Of Foreigner Accused In Drug Case In Guntur Sensational - Sakshi

పోలీసులు స్వాదీనం చేసుకున్న నంబర్‌ ప్లేట్లు(ఫైల్‌), ఇన్‌సెట్‌లో నిందితుడు షాజీ(ఫైల్‌)

సాక్షి, గుంటూరు: రాజధాని జిల్లాలో డ్రగ్స్‌ కేసులో విదేశీయుడైన నిందితుడిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. గంజాయి, కొకైన్, హెరాయిన్‌ తదితర మత్తు పదార్థాలు తనిఖీల్లో పట్టుపడటంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలోని ఆదర్శనగర్‌లో ఓ అపార్టుమెంట్‌లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్న సౌదీ దేశానికి చెందిన డ్రగ్స్‌ వ్యాపారి షాజీ అలియాస్‌ మహమ్మద్‌ని సినీఫక్కీలో వెంటాడి శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముందుగా విదేశీయుడితో సంబంధాలు ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ముఠా సభ్యుల అన్వేషణ కోసం ప్రత్యేక బృందాల్ని అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పటికే గుంటూరులోని ఓ ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకుడి కుమారుడితో పాటు మరో యువకుడితో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విదేశీయుడు షాజీ పాస్‌పోర్టును బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు సీజ్‌ చేసినట్లు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎందుకు సీజ్‌ చేశారు..ఎప్పుడు సీజ్‌ చేశారు.. అనే అంశాల గురించి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.  

ఇబ్రహీంపట్నం నుంచి పరారీ  
ఐదు నెలల కిందట షాజీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ డ్రగ్స్‌ వ్యాపారం చేసేవాడు. అక్కడ పోలీసుల నిఘా పెరిగినట్లు అనుమానించాడు. అప్పటికే అతని కోసం రెక్కీ కొనసాగుతున్న విషయాన్ని పసిగట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై గుంటూరుకు చేరుకొని డ్రగ్స్‌ ముఠా సభ్యుల సహకారంతో ఆదర్శనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాడని విశ్వసనీయంగా తెలిసింది.

పూర్వ విద్యార్థుల గురించి ఆరా 
నిందితుడి కాల్‌ డేటాను పోలీసులు పరిశీలించారు. అధికంగా పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థుల ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో నిందితుడితో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న స్థానిక విద్యార్థుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. షాజీతో పరిచయాలు ఉన్న వ్యక్తులు, విద్యార్థులు, అతన్ని తరచూ కలిసే ముఠా సభ్యుల వివరాల కోసం నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఇదంతా ముందుగానే ఊహించిన షాజీ పోలీసుల నుంచి తప్పించుకొని పరారయ్యేందుకు యత్నించిన సమయంలోనే ఫోన్‌ను పగులకొట్టి పడేసిన ప్రాంతంలో అది దొరకడంతో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తు్తన్నప్పటికీ నిందితుడు సరైన వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది.

తెలుగు మాట్లాడితే తిరిగి అందులో సమాధానం చెప్పలేక పోతున్నప్పటికీ అడిగిన ప్రతి ప్రశ్నను అర్థం చేసుకుంటున్నాడని.. తిరిగి పొడిపొడిగా ఇంగ్లిష్‌లో సమాధానం చెబుతున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో షాజీని విచారిస్తే డ్రగ్స్‌ మాఫియా బయట పడే అవకాశం ఉంది. డ్రగ్స్‌ను నిందితుడు గోవా నుంచి గుంటూరుకు పార్సిల్‌ రూపంలో తరిలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోవాలో డ్రగ్స్‌ మాఫియాతో మంచి పరిచయాలు ఉన్న కారణంగానే అక్కడ నుంచి పార్సిల్స్‌ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి గురించి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో మాట్లాడి తదుపరి చర్యలు చేపట్టారు.

అంతా ఆన్‌లైన్‌లోనే... 
షాజీ ఆన్‌లైన్‌లో విద్యార్థులు, యువతతో పరిచయాలు చేసుకుని, అందులో వచ్చే ఆర్డర్‌ ప్రకారం డబ్బు చెల్లించిన తర్వాతే డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటాడు. చాప కింద నీరులా ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నగరంలో సరఫరా చేస్తుంటాడు. స్థానిక నివాసాల్లో పోలీసులు ఆరా తీయగా.. ఎప్పుడూ అతనికి ఆన్‌లైన్‌ పార్సిల్స్‌ వస్తుంటాయని, ఎక్కువగా బయటకు రాడని చెప్పారు. ఒకవేళ బయటకు వస్తే భయంకరమైన వస్తువులు తీసుకువచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడని తెలిపారు. నిందితుని గదిలో పలు రాష్ట్రాలకు చెందిన ద్విచక్ర వాహన, కారు నంబరు ప్లేట్లు ఉండటాన్ని గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. గదిని సీజ్‌ చేసి మరింత నిఘా ఏర్పాటు చేశారు. షాజీతో పాటుగా ఉన్న యువతి ఏమైంది? ఎక్కడ ఉంది? అనే వివరాలు కూడా నిందితుడు చెప్పేందుకు నిరాకరించడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement