Airport Police
-
విమానంలో ఎన్ఆర్ఐ వెకిలి చేష్టలు
దొడ్డబళ్లాపురం: విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలితో వెకిలి చేష్టలు వేసిన వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. లుఫ్తాన్సా విమానంలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెంగళూరుకు వస్తున్న ఎన్నారై రంగనాథ్.. పక్క సీట్లో మహిళ నిద్రిస్తుండగా ఆమెను అసభ్యంగా తాకసాగాడు. మహిళ మేలుకుని అతన్ని అడ్డుకుంది. సిబ్బంది సహాయంతో మరో సీటులోకి మారింది. విమానం బెంగళూరులో దిగగానే బాధిత మహిళ కేఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడు రంగనాథ్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ జరిపి అతన్ని బెయిలుపై వదిలేశారు. -
ఎయిర్‌పోర్టులో టీడీపీ కార్యకర్త హల్చల్
గోపాలపట్నం: హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో మంగళవారం విశాఖ వచ్చిన టీడీపీ కార్యకర్త ఆడారి కిశోర్‌కుమార్ ఎయిర్‌పోర్టు వద్ద హల్చల్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు ఫ్లకార్డులు ప్రదర్శించాడు. విమానంలో కూడా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ హడావిడి చేశాడు. విమానం దిగి బయటకు వచ్చిన ప్రయాణికులు కిశోర్ తీరుతో ఇబ్బందులు పడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చే సమయం కావడంతో ఆయన కాన్వాయ్ ముందు ఫ్లకార్డు ప్రదర్శించేందుకు అతను యత్నించాడు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు. అయితే పాస్‌పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. -
వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ఒక వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు దొరికాయి. విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (70) బ్యాగ్‌లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్‌ను స్కానర్‌లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ విచారించారు. తమ పాత ఇంట్లో వస్తువులు సర్దానని, ఈ క్రమంలో పాత బ్యాగ్‌లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్ బయలుదేరానని ఆమె తెలిపారు. గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా ఆన్లైన్లోనే..!!
సాక్షి, గుంటూరు: రాజధాని జిల్లాలో డ్రగ్స్ కేసులో విదేశీయుడైన నిందితుడిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. గంజాయి, కొకైన్, హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు తనిఖీల్లో పట్టుపడటంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఆదర్శనగర్‌లో ఓ అపార్టుమెంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్న సౌదీ దేశానికి చెందిన డ్రగ్స్ వ్యాపారి షాజీ అలియాస్ మహమ్మద్‌ని సినీఫక్కీలో వెంటాడి శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముందుగా విదేశీయుడితో సంబంధాలు ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ముఠా సభ్యుల అన్వేషణ కోసం ప్రత్యేక బృందాల్ని అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పటికే గుంటూరులోని ఓ ప్రముఖ బిర్యానీ హోటల్ నిర్వాహకుడి కుమారుడితో పాటు మరో యువకుడితో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విదేశీయుడు షాజీ పాస్‌పోర్టును బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు సీజ్ చేసినట్లు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎందుకు సీజ్ చేశారు..ఎప్పుడు సీజ్ చేశారు.. అనే అంశాల గురించి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి పరారీ ఐదు నెలల కిందట షాజీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. అక్కడ పోలీసుల నిఘా పెరిగినట్లు అనుమానించాడు. అప్పటికే అతని కోసం రెక్కీ కొనసాగుతున్న విషయాన్ని పసిగట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై గుంటూరుకు చేరుకొని డ్రగ్స్ ముఠా సభ్యుల సహకారంతో ఆదర్శనగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. పూర్వ విద్యార్థుల గురించి ఆరా నిందితుడి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. అధికంగా పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో నిందితుడితో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న స్థానిక విద్యార్థుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. షాజీతో పరిచయాలు ఉన్న వ్యక్తులు, విద్యార్థులు, అతన్ని తరచూ కలిసే ముఠా సభ్యుల వివరాల కోసం నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఇదంతా ముందుగానే ఊహించిన షాజీ పోలీసుల నుంచి తప్పించుకొని పరారయ్యేందుకు యత్నించిన సమయంలోనే ఫోన్‌ను పగులకొట్టి పడేసిన ప్రాంతంలో అది దొరకడంతో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తు్తన్నప్పటికీ నిందితుడు సరైన వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. తెలుగు మాట్లాడితే తిరిగి అందులో సమాధానం చెప్పలేక పోతున్నప్పటికీ అడిగిన ప్రతి ప్రశ్నను అర్థం చేసుకుంటున్నాడని.. తిరిగి పొడిపొడిగా ఇంగ్లిష్‌లో సమాధానం చెబుతున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో షాజీని విచారిస్తే డ్రగ్స్ మాఫియా బయట పడే అవకాశం ఉంది. డ్రగ్స్‌ను నిందితుడు గోవా నుంచి గుంటూరుకు పార్సిల్ రూపంలో తరిలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోవాలో డ్రగ్స్ మాఫియాతో మంచి పరిచయాలు ఉన్న కారణంగానే అక్కడ నుంచి పార్సిల్స్ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి గురించి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో మాట్లాడి తదుపరి చర్యలు చేపట్టారు. అంతా ఆన్లైన్లోనే... షాజీ ఆన్లైన్లో విద్యార్థులు, యువతతో పరిచయాలు చేసుకుని, అందులో వచ్చే ఆర్డర్ ప్రకారం డబ్బు చెల్లించిన తర్వాతే డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటాడు. చాప కింద నీరులా ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నగరంలో సరఫరా చేస్తుంటాడు. స్థానిక నివాసాల్లో పోలీసులు ఆరా తీయగా.. ఎప్పుడూ అతనికి ఆన్లైన్ పార్సిల్స్ వస్తుంటాయని, ఎక్కువగా బయటకు రాడని చెప్పారు. ఒకవేళ బయటకు వస్తే భయంకరమైన వస్తువులు తీసుకువచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడని తెలిపారు. నిందితుని గదిలో పలు రాష్ట్రాలకు చెందిన ద్విచక్ర వాహన, కారు నంబరు ప్లేట్లు ఉండటాన్ని గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. గదిని సీజ్ చేసి మరింత నిఘా ఏర్పాటు చేశారు. షాజీతో పాటుగా ఉన్న యువతి ఏమైంది? ఎక్కడ ఉంది? అనే వివరాలు కూడా నిందితుడు చెప్పేందుకు నిరాకరించడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికురాలి బ్యాగు మాయం
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ మాయమైంది. అందలో విలువైన ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. శుక్రవారం అమెరికా నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావ్య బ్యాగు మాయమైంది. దీంతో ఆమె ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో బ్యాగ్ చోరీ
శంషాబాద్ (రంగారెడ్డిజిల్లా) : కారులో పెట్టిన బ్యాగ్ చోరీ అయిన సంఘటన మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో జరిగింది. అదిలాబాద్‌కు చెందిన మార్కండేయ తన కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచ్చాడు. కారును పార్కింగ్‌లో పెట్టాడు. పార్కింగ్‌లో ఉన్న కారు అద్దాలు పగలగొట్టి అందులో వున్న బ్యాగ్‌ను గుర్తుతెలియన వ్యక్తులు చోరీ చేశారు. బ్యాగులో రెండు సెల్ఫోన్లు, డెబిట్‌కార్డులు, రెండున్నర తులాల బంగారం చోరీ అయినట్లు బాధితుడు ఎయిర్‌పోర్టు పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసును విచారిస్తున్న్రారు. -
త్రిష అయితేనేం
ఎంత సెలబ్రెటీస్ అయినా ఒక్కోసారి అనూహ్య సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటేనే అశాంతికి గురి కావలసి వస్తుంది. నటి త్రిషకు శనివారం చెన్నై ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఈ చెన్నై చిన్నది దశాబ్దం పైగా హీరోయిన్గా వెలుగొందుతున్నారు. బాలీవుడ్ ప్రవేశం కూడా చేశారు. అలాంటి పాపులర్ హీరోయిన్ త్రిషను చెన్నై విమానాశ్రయ రక్షణాధికారులు గుర్తించకపోవడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. త్రిష హైదరాబాద్ వెళ్లడం కోసం శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. ప్యాంట్, షర్టు, కూలింగ్ గ్లాస్ ధరించిన త్రిషపై అక్కడి సెక్యూరిటీ అధికారులకు సందేహం కలిగింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపించమని అడిగారు. చిరు వాగ్వాదం తరువాత త్రిష తన గుర్తింపుకార్డు చూపించారు. దీంతో ఆమెను సెక్యూరిటీ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతించారు. దీన్ని లైట్‌గా తీసుకున్న త్రిష మాట్లాడుతూ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు తన గుర్తింపు కార్డును చూపించమని అడగటంలో తప్పు లేదన్నారు. కొన్ని అసాంఘిక సంఘటనలు జరుగుతున్న కారణంగా వారు భద్రత ఏర్పాట్లపై శ్రద్ద వహిస్తున్నారని త్రిష పేర్కొన్నారు.