అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు.
అయితే పాస్‌పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్‌లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment