సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: ఈఎస్‌ఐ స్కామ్ కేసులో ఏ–2 నిందితునిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏసీబీ విచారణకు సహకరించలేదని, అరకొర సమాధానాలు.. ఆపై దాటవేత ధోరణిని అవలంబించినట్టు సమాచారం. ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం(సీఐయూ) డీఎస్పీలు పీఎస్‌ఆర్కే ప్రసాద్, చిరంజీవితో కూడిన బృందం గుంటూరు జీజీహెచ్‌లో 25, 26, 27 తేదీల్లో విచారణ నిర్వహించింది. తొలిరోజు మూడు గంటలు, రెండోరోజు ఐదు గంటలు, మూడోరోజైన శనివారం నాలుగున్నర గంటలు చొప్పున మొత్తంగా మూడు రోజుల్లో 12.30 గంటలపాటు విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విచారణకు అచ్చెన్నాయుడు ఏమాత్రం సహకరించలేదు. లేఖ రాసినట్టు మినహా మిగిలిన విషయాల్లో స్పష్టత ఇవ్వలేదు. సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని సమాచారం.
► లేఖ మాత్రమే రాశానని, మాటమాత్రంగా సిఫారసులు చేశానని అంగీకరించిన అచ్చెన్నాయుడు ఆ తర్వాత జరిగిన ఒప్పందాలు, సంతకాలు తదితర అంశాల్లో తన ప్రమేయం లేదని దాటవేత ధోరణితో మాట్లాడినట్టు తెలిసింది. పరికరాలు, కొనుగోళ్ల కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే కట్టబెట్టాలి అన్నట్టుగా సిఫార్సు లేఖలో ‘ఇన్ మై ఆర్డర్’ అని పేర్కొనడాన్ని ఏసీబీ అధికారులు ప్రస్తావిస్తూ.. సాధారణంగా సాధ్యాసాధ్యాలను బట్టి నిబంధనలకు లోబడే కాంట్రాక్టు ఇవ్వాలని సూచిస్తారని, మీరెందుకు ‘ఇన్ మై ఆర్డర్’ అని రాశారని అడిగిన ప్రశ్నకు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలినట్టు సమాచారం.
► టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్, పరికరాల కొనుగోళ్లపై ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది.
ముగిసిన కస్టడీ.. రిమాండ్ పొడిగింపు
అచ్చెన్నాయుడుకు ఏసీబీ కస్టడీ శనివారం సాయంత్రంతో ముగిసింది. అయితే విచారణ సమయంలో సరైన సమాధానాలు రాకపోవడంతో లోతైన దర్యాప్తుకోసం మరోసారి ఆయన్ని ఏసీబీ కస్టడీకి కోర్టును కోరే అవకాశముంది. అచ్చెన్నాయుడి జ్యుడీషియల్ రిమాండ్ శనివారం సాయంత్రంతో ముగియగా.. వచ్చే నెల 10 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2 రోజుల విచారణ అనంతరం శుక్రవారమే వారిని జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment