మాట్లాడుతున్న డీఎస్పీ స్వరూపారాణి
సీతంపేట : ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం రేగింది. కొంతమంది గుర్తుతెలియని దొంగల ముఠా సంచిరిస్తూ చిన్నారులనే టార్గెట్ చేస్తూ తీసుకువెళ్లడానికి యత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఓ వీధిలో నివర్తి రమేష్ ఇంట్లో గుర్తుతెలియని మహిళ దూరి ఆయన కుమార్తె స్వాతిక(3)ను కిడ్నాప్ చేయడానికి యత్నించింది.
తలుపులు లేని కిటికీలోనుంచి తల్లి జ్యోతి పక్కనే పడుకున్న బాలిక కాళ్లు పట్టుకుని లాగేయడంతో తల్లికి తెలివివచ్చింది. బాలికను విడిపించుకునే క్రమంలో కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు రావడంతో బాలికను అక్కడ వదిలేసి పరుగులకించినట్టు బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, యువకులంతా రాత్రి ఎంత వెతికినా దొరకలేదు.
స్థానిక ఎస్‌ఐ కె.రాముతో పాటు పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. అయినా ఎవరూ పట్టుబడలేదు. నలుగురు వచ్చారని, ముగ్గురు మగాళ్లు, ఒక మహిళ వచ్చిందని ఆటోతో వెళ్లిపోయారని కొంతమంది చెబుతున్నారు.
అలాగే రాజన్నగూడలో సైతం ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని మహిళ జీడిపిక్కలు ఏరడానికి వెళుతున్న చిన్నారులను వెంబడించిందని, చిన్నారులు తప్పించుకున్నారని ఎంపీపీ ప్రతినిధి చంద్రశేఖరరావుతో పాటు గ్రామస్తులు తెలిపారు. అలాగే వలగెడ్డ, పెద్దూరులలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వదంతులే...
ఇవన్నీ వదంతులేనని పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి అన్నారు. ఐటీడీఏ వద్ద సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఎటువంటి మూఠాలు సంచరించడం లేదన్నారు. ప్రజలు ఇటువంటివి నమ్మవద్దన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారమివ్వాలన్నారు. ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనికి సంబంధించి మైక్ ద్వారా ప్రజల్ని చైతన్యం చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆమెతో పాటు సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాము ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment