చంపుతాడనే భయంతోనే కడతేర్చారు! | Auto Driver Murder Case Reveals Panjagutta Police | Sakshi
Sakshi News home page

చంపుతాడనే భయంతోనే కడతేర్చారు!

Published Mon, Oct 21 2019 7:57 AM | Last Updated on Mon, Sep 5 2022 12:28 PM

Auto Driver Murder Case Reveals Panjagutta Police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: పశ్చిమ మండల పరిధిలోని పంజగుట్ట ఠాణాకు కూతవేటు దూరంలో ఆదివారం పట్టపగలు దారుణ హత్య చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ఆటోడ్రైవర్‌ హత్యకు ప్రతీకారంగా, అతడు తమను కూడా చంపేస్తాడనే భయంతో ఆ కేసులో హతుడి బంధువులే ఈ దారుణానికి తెగబడ్డారు. కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించిన వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. డీసీపీలు  సుమతి, పి.రాధాకిషన్‌రావులతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పంజగుట్ట, బడీ మజ్దిద్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అన్వర్‌ (32), నాగార్జున హిల్స్‌లోని పంజాబ్‌ పహాడ్‌ వాసి మీర్‌ రియాసత్‌ అలీ (39) స్నేహితులు. పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ సమీపంలోని అడ్డాలో వారిరువురు ఆటోలను నిలుపుకునే వారు. అయితే అన్వర్‌ చేతబడి చేయించినందుకే తనతో పాటు తన భార్య, పిల్లలు సైతం తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని రియాసత్‌ అతడిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు అన్వర్‌తో గొడవపడ్డాడు. ఈ ఏడాది జూన్‌ 26న అన్వర్‌ను హత్య చేయాలని భావించిన రియాసత్‌ కత్తితో  ఆటో అడ్డాకు వచ్చాడు. అదే రోజు సాయంత్రం అన్వర్‌తో ఘర్షణకు దిగిన రియాసత్‌ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అన్వర్‌ నేరుగా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి రిసెప్షన్‌లో కుప్పకూలాడు. రియాసత్‌ కూడా కత్తితో సహా  స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అన్వర్‌ను ఆస్పత్రికి తరలించేలోగా అతను కన్ను మూశాడు.

ఆ కేసులో అరెస్టైన రియాసత్‌ అలీ ఈ నెల 10న బెయిల్‌పై బయటకు వచ్చినా బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే అతడి వల్ల తమకు కూడా ముప్పు ఉందని భావించిన అన్వర్‌ కుటుంబ సభ్యులు రియాసత్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అన్వర్‌ కుటుంబ సభ్యులు అబ్దుల్‌ రెహ్మాన్, మహ్మద్‌ అజర్, అబ్దుల్‌ అలీంలతో పాటు వారి స్నేహితులు సయ్యద్‌ అమ్జద్, మహ్మద్‌ హసన్‌ కలిసి రంగంలోకి దిగారు. రియాసత్‌ ప్రతి రోజూ ఉదయం నాగార్జునహిల్స్‌లోని శ్రీ లక్ష్మీ నర్సింహ్మ టీ స్టాల్‌కు వెళ్లి చాయ్‌ తాగుతుంటాడు. ఈ విషయం తెలిసిన రెహ్మాన్‌ ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించే బాధ్యతలు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం మరో నిందితుడితో కలిసి బైక్‌పై అక్కడికి వచ్చి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ వద్ద కాపుకాశాడు. 9 గంటల ప్రాంతంలో రియాసత్‌ టీ స్టాల్‌కు వచ్చిన విషయాన్ని గుర్తించి మిగిలిన వారికి సమాచారం అందించారు. దీంతో మిగిలిన ముగ్గురు నిందితులు మారుతి ఒమినీ వ్యాన్‌లో అక్కడికి వచ్చారు. ఐదుగురూ కలిసి కొబ్బరిబొండాలు నరికే కత్తులతో రియాసత్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న హతుడి సోదరుడు అబ్బాస్‌ ఘటనాస్థలికి వచ్చి  కొన ఊపిరితో రియాసత్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించాడు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ వైద్యులు హతుడి తలపై 10 గాయాలు ఉన్నట్లు, అతడి కాలితో పాటు ఇతర శరీర భాగాల్లోనూ కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న 24 సీసీ కెమెరాల్లో ని ఫీడ్‌ను అధ్యయనం చేశారు. నాలుగింటిలో దొరికిన ఆధారాలను బట్టి నిందితులను గుర్తించారు. వారిని పట్టుకోవడానికి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. కొన్ని గంటల్లోనే రెహ్మాన్, అజర్, అలీం చంద్రాయణగుట్టలో ఉన్న ట్లు సమాచారం అందడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  వీరి నుంచి కత్తులు, బైక్, వ్యాన్‌ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమ్జద్, హసన్‌ కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement