నల్లగొండ, మిర్యాలగూడ టౌన్ : పరువు హత్యకు గురైన పేరుమాళ్ల ప్రణయ్ భార్య అమృతను బెదిరించిన కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు గత నెలలో అమృత ఇంటికి వెళ్లి పరువు హత్య కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. తన తండ్రి ప్రోద్బలంతోనే వెంకటేశ్వర్లు బెదిరించాడని ఆరోపిస్తూ అమృత అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో వన్ టౌన్ పోలీసులు అమృత తండ్రి తిరునగరు మారుతీరావు ఎ–1గా, మహ్మద్ ఖరీం ఎ–2గా, కందుల వెంకటేశ్వర్లు ఎ–3 నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఆ కేసులో వీరిని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించగా గడువు ముగియడంతో మరో 14రోజుల పొడిగించారు. తిరిగి సోమవారం 8వ అదనపు కోర్టులో బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల షూరిటీతో పాటు రెండు నెలల పాటు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల లోపు స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలనే షరతులను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment