సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అహ్మద్ భారీ, కరీం, శివ, నిజాం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ-1)గా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలపడంతో.. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన.. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.(అమృతాప్రణయ్‌కు నిరాశ.. దక్కని చివరి చూపు!)
కాగా సాక్షి టీవీ చేతికి చిక్కిన ప్రణయ్ హత్య కేసు చార్జ్‌షీట్ ప్రకారం.. ఈ కేసులో మారుతీరావు సహా 8 మంది నిందితుల పేర్లను పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఏ-1 గా మారుతీరావు, ఏ-6గా ఆయన తమ్ముడును శ్రవణ్‌ను పేరును చేర్చి.. 102 మంది సాక్షులను విచారించి... అమృత- ప్రణయ్‌ల ప్రేమ మొదలు.. ప్రణయ్ హత్య వరకు ప్రతీ అంశాన్ని1200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రణయ్ హత్య సమయంలో అతడి భార్య అమృత ఆరు పేజీల స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమెతో పాటు ప్రధాన నిందితుడు మారుతీరావు, శ్రవణ్, ప్రణయ్ తండ్రి బాలస్వామి తదితరుల ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. (డ్రైవర్‌ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు)
ప్రణయ్ హత్య సమయంలో అమృత ఇచ్చిన ఆరు పేజీల స్టేట్‌మెంట్ ప్రకారం
నేను స్కూళ్లో చదువుతున్నపుడే ప్రణయ్‌తో పరిచయం. మిర్యాలగూడ కాకతీయ స్కూల్ లో మా ప్రేమ మొదలు. నేను 9 వ తరగతి చదువుతున్నపుడు, ప్రణయ్10వ తరగతి చదువుతున్న సమయంలో స్నేహం మొదలైంది.. ఆ తరువాత ప్రేమగా మారింది. మేము ఇద్దరం చనువుగా ఉండటం చూసి ప్రణయ్ తక్కువ కులం వాడు, అతనితో మాట్లాడవద్దని మా నాన్న నన్ను బెదిరించాడు. చదువు మద్యలో ఆపించి ఇంటి నుండే పరీక్షలు రాయించాడు. ఇంటర్ కూడా మధ్యలో ఆపించేసి ఇంట్లోనే ఉంచాడు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో కూడా.. నేను ఇంకా ప్రణయ్‌తో మాట్లాడుతున్నా అని డిస్‌కంటిన్యూ చేయించాడు. ఒక రోజు మిర్యాలగూడ రాఘవ్ టాకీస్‌లో నేను, ప్రణయ్ సినిమాకి వెళ్ళినపుడు మా నాన్న, బాబాయ్ శ్రవణ్ అక్కడికి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళి బాగా కొట్టారు. ప్రణయ్ వాళ్ల తల్లిదండ్రులను పిలిచి బెదిరించారు. కొన్ని రోజులు ప్రణయ్ నాకు దూరంగా ఉన్నాడు. నేను ప్రణయ్‌తో మాట్లాడకుండా ఉండలేక పెళ్లి చేసుకుందాం లేకపోతే చచ్చిపోదాం అని చెప్పాను.(ఇలా చితికి..)
ఆ తర్వాత ప్రణయ్ అంగీకరించడంతో 2018 జనవరి 30 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాం. మిర్యాలగూడలో నేను కనిపించలేదని మా నాన్న మారుతీరావు మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు నన్ను, ప్రణయ్‌ను మిర్యాలగూడ తీసుకొచ్చాక.. నేను ప్రణయ్ మేజర్లు కావడంతో ప్రణయ్ వాళ్ల ఇంట్లోనే ఉంటా అని చెప్పాను. 2018 ఆగస్ట్ 17 న ప్రణయ్ తలిదండ్రులు మా రిసెప్షన్ గ్రాండ్‌గా చేశారు. అప్పటి నుంచి పగ పెంచుకున్న మా నాన్న ప్రణయ్‌ను అంతం చేస్తా అని హెచ్చరించాడు. 2018 సెప్టెంబర్ 14 న చెకప్ కోసం జ్యోతి హాస్పిటల్‌కు వెళ్ళిన సమయంలో ప్రణయ్‌ను హత్య చేశారు.
మారుతీరావు స్టేట్‌మెంట్
మా కంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుని నా కూతురు మా పరువు తీసింది. సమాజంలో తల ఎత్తుకోలేక పోయాం. స్కూల్ నుంచే వారి ప్రేమ నడుస్తుంది. ఎన్నోసార్లు ప్రణయ్‌ను మర్చిపొమ్మని నా కూతురికి చెప్పాను. అయినా వినలేదు. మాకు ఇష్టం లేకుండా హైదరాబాద్ పోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అయిన దగ్గరి బంధువులతో రాయబారం పంపినా నా కూతురు రాలేదు. అందుకే ప్రణయ్‌ను చంపాలనుకుని ప్లాన్ చేశాను. హత్యకు డబ్బు అవసరం అవుతుంది.. కాబట్టి నా తమ్ముడికి చెప్పి డబ్బు సమకూర్చాలని అడిగాను. ప్రణయ్‌ను హత్య చేయించమని కిరాయి ఇచ్చాను.
మారుతీరావు తమ్ముడు శ్రవణ్ స్టేట్‌మెంట్
అమృత ప్రణయ్‌ల పెళ్లి మా అన్నయ్యను తల దించుకునేలా చేసింది. సమాజంలో మా పరువూ పోయేలా అమృత ప్రవర్తించింది. ప్రణయ్‌ను హత్య చేయించడానికి డబ్బు అవసరం అవుతుంది అని అన్నయ్య అన్నాడు. చింతపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఉన్న ప్లాట్ అమ్మి డబ్బు జమ అయ్యేలా చూస్తా అని చెప్పా. తాలకిల విజయ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ప్లాట్ అమ్మాలని పత్రాలు సిద్ధం చేసుకున్నాం.(డబ్బుల కోసం అమృత డ్రామాలు..)
ప్రణయ్ తండ్రి బాలస్వామి స్టేట్‌మెంట్
స్కూల్ నుంచే అమృత- ప్రణయ్ స్నేహితులు. తనని ప్రేమించమని అమృత.. మా అబ్బాయి ప్రణయ్ నీ కోరింది. తన ప్రేమను కాదంటే అమృత అత్మహత్య చేసుకుంటా అని చెప్పింది. మా అబ్బాయి ప్రణయ్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అమృతను తీసుకుని ఆర్య సమాజ్ పోయి పెళ్లి చేసుకున్నారు. పలు మార్లు మా కుమారుడిని చంపుతామని బెదిరించారు. మారుతీరావు , శ్రవణ్ కుమార్ ఇద్దరు మా అబ్బాయిని చంపేందుకు కుట్ర పన్నారు. మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించేవారు. అమృత ప్రెగ్నెంట్ అయ్యాక జ్యోతి హాస్పిటల్‌కు వెళ్లి వస్తున్న టైంలో నా కొడుకు ప్రణయ్‌ను చంపేశారు.(అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు)
Comments
Please login to add a commentAdd a comment