
నిందితులు విశ్వనాథన్, జయగణేష్
బ్యాంకు చోరీ ఉదంతంలో నకిలీ కీ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసులు చేపట్టిన విచారణ ఫలితాన్ని ఇచ్చింది. 24 గంటల వ్యవధిలోనే చోరీకి పాల్పడిన బ్యాంకు సిబ్బందితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఇంట్లో దాచిన 32.70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తిరువళ్లూరు: పోలీసులు ఊహించినట్టే నకిలీ తాళం చెవితోనే బంగారం చోరీ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉద్యోగి ఇంట్లో ఉంచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శిబిచక్రవర్తి మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరువళ్లూరు జేఎన్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సినిమా ఫక్కీలో జరిగిన చోరీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ చోరీలో ఖాతాదారులు తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన 32.70 కిలోల బంగారం చోరీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బ్యాంకులో ఉంచిన నగలు చోరీకి గురైనట్టు తెలియడంతో ఖాతాదారుల ఆందోళనలు, పోలీసుల మోహరింపు తదితర సంఘటనలతో సోమవారం అర్ధరాత్రి వరకు బ్యాంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
అయితే చోరీ జరిగిన తీరుపై పోలీసులకు ఏర్పడిన అనుమానంతో బ్యాంకు సిబ్బందిపైనే ఫోకస్ పెట్టారు. తాళాలు పగులగొట్టకుండా చోరీ ఎలా చేసి ఉంటారని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ శిబిచక్రవర్తి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులకు కొన్ని కీలకమైన ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగా బ్యాంకు సిబ్బందికి ఉచ్చుబిగించి విచారణ చేపట్టారు. మేనేజర్ శేఖర్, డిప్యూటీ మేనేజర్‌లు రంజన్, భాను, ఆఫీస్ అసిస్టెంట్ విశ్వనాథన్‌ను వేర్వేరుగా విచారించారు. విచారణలో విశ్వనాథన్ కీలక నిందితుడిగా గుర్తించారు.
నకిలీ తాళాలు తయారీ
శుక్రవారం బ్యాంకు ముగిసిన తరువాత కావాలనే తాళాలు వేయకుండా వదలిపెట్టారా లేదా నకలి కీ తయారు చేసి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ సాగించారు. మొదట దశలో నకిలీ కీ తయారుచేసి ఉంటారనే కోణంలో విశ్వనాథన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వనాథన్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అతను పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. బ్యాంకు కాంప్లెక్స్‌లో ఉన్న నీల్ గ్రీస్ సంస్థలో పనిచేసే జయగణేష్, అదే కాంప్లెక్స్‌లో ప్లంబర్‌గా పనిచేసే గౌతమ్ స్నేహితులని వారితో కలసి బ్యాంకులో చోరీకి పథకం వేసినట్టు ఒప్పుకున్నాడు. సెవ్వాపేట సమీపంలోని మామిడితోటలో వారం రోజుల పాటు శ్రమించి నకిలీ తాళం చెవి తయారు చేసినట్టు విశ్వనాథన్ ఒప్పుకున్నాడని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని మరింత లోతైన విచారణ చేస్తున్నామన్నారు.
నగలు స్వాధీనం
నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం విశ్వనాథ్ ఇంట్లో దాచి ఉంచిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు సిబ్బందితో కలసి లెక్కింపు పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బ్యాంకు చోరీ వ్యవçహారం 24 గంటల వ్యవధిలోనే కొలిక్కి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చోరీ చేసిన బంగారు నగలు రూ.9 కోట్ల విలువ చేస్తాయని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment