ఫర్వేజ్, జంషీద్, బాసిత్
సాక్షి, హైదబాద్: ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, నగరానికి చెందిన అబ్దుల్లా బాసిత్‌కు కశ్మీర్‌లోనూ నెట్‌వర్క్ ఉంది. అతడు మరికొందరితో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ, కశ్మీర్(జేకేఐఎస్) ఏర్పాటు చేశాడు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత నెల 7న పట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న బాసిత్‌ను ఈ కోణంలోనూ విచారించాలని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కేసులో ఎన్‌ఐఏ ఢిల్లీ యూనిట్ అధికారులు ఆగస్టు 12న బాసిత్, ఖదీర్‌లను అరెస్టు చేసిన విషయం విదితమే.
ఆది నుంచి ఉగ్రభావాలతోనే...
చాంద్రాయణగుట్ట, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్(సీఎస్‌ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్‌లైన్ ద్వారా ఆకర్షితుడై ఐసిస్‌లో చేరాలనే ఉద్దేశంతో బాసిత్ 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలిసి బంగ్లాదేశ్ మీదుగా అఫ్ఘనిస్తాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశాడు. బంగ్లాదేశ్ చేరుకోవడం కోసం కోల్‌కతా వరకు వెళ్లిన వీరిని అక్కడ పోలీసులు పట్టుకుని నగరానికి తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం వీరిని విడిచిపెట్టారు. కాలేజీలో సీటు కోల్పోవడంతో అతను హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. అప్పటికీ తమ పంథా మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్ ఐసిస్‌లో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని పీవోకే వెళ్లాలని వీరు పథకం వేశారు. 2015 డిసెంబర్ 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ పంథా మార్చుకోని బాసిత్ విదేశాలతోపాటు ఢిల్లీ, కశ్మీర్‌ల్లో ఉన్న ఐసిస్ నేతలతో సంబంధాలు కొనసాగించాడు. సోషల్‌మీడియా యాప్స్ థ్రీమా, టెలిగ్రాం యాప్స్ ద్వారా సంప్రదింపులు చేసేవాడు.
కశ్మీర్ ‘ప్రత్యేకం’కావాలని...
భవిష్యత్తులో కశ్మీర్ భారత్ నుంచి వేరేపడినా అది పాకిస్తాన్‌లో భాగం కాకుండా ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో జేకేఐఎస్ ఏర్పాటు చేశారు. దీనిలో బాసిత్‌తోపాటు కశ్మీర్‌కు చెందిన లోన్, ఉత్తరప్రదేశ్‌లోని గజ్‌రోలాకు చెందిన పర్వేజ్, జంషీద్‌తోపాటు మరో నలుగురు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 1న కశ్మీర్‌కు వెళ్లి లోన్ అనే ఉగ్రవాది వద్ద ఆశ్ర యం తీసుకుని జేకేఐఎస్ విస్తరణపై చర్చించాడు. కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత నెల 7న ఢిల్లీలోని జామామసీదు బస్టాండ్‌లో పర్వేజ్, జంషీద్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణ నేపథ్యంలో బాసిత్‌కు ఉన్న కశ్మీర్ లింకు, నెట్‌వర్క్ బయటపడ్డాయి. ఆన్‌లైన్‌లో ఎక్కువమందిని ఆకర్షించలేకపోయిన నేపథ్యంలోనే జేకేఐఎస్ పూర్తిస్థాయి ఆపరేషన్లు ప్రారంభించలేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అరెస్టైనా శుభాకాంక్షలు...
అబ్దుల్లా బాసిత్ ఫేస్‌బుక్‌లో తన పేరుతోనే ఓ పేజ్ కలిగి ఉన్నాడు. వీరిలో అనేక మందికి బాసిత్ అరెస్టు విషయం తెలియకపోవడమో, తెలిసినా పట్టించుకోకపోవడందో బాసిత్ పుట్టిన రోజు నేపథ్యంలో గత నెల 2న (సెప్టెంబర్) అతడి టైమ్‌లైన్‌పై అనేకమంది బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్టింగ్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment