బ్యూటీషియన్ పద్మ , అనుమానితుడు నూతనకుమార్
హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో నిందితుడు బత్తుల నూతనకుమార్ విక్టర్ ఆత్మహత్య చేసుకోవటంతో దర్యాప్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. పద్మపై అత్యంత పైశాచికంగా దాడి చేసిన అనంతరం ఈ నెల 24 నుంచి అదృశ్యమైన నూతన కుమార్ గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం నుదురుపాడు వద్ద రైల్వే పైవంతెన కింద ఆదివారం సాయంత్రం శవమై తేలడం తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లె పద్మ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.
తొలుత హైదరాబాద్‌కు పరారీ..
పద్మపై కర్కసంగా హత్యాయత్నం చేసిన నూతనకుమార్ వెంటనే ఘటనాస్థలాన్ని విడిచిపెట్టి తన బైక్‌పై హైదరాబాద్‌కు పరారైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం, నాలుగు ప్రత్యేక బృందాలను నియమించటం, అతని స్నేహితులను విచారించటం, మీడియాలో అతని పేరు, ఫొటో సంచలనం కావటంతో నూతనకుమార్‌కు గత్యంతరం లేక బలవ్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నూతనకుమార్ హైదరాబాద్‌లో ఉన్నట్లు శనివారం రాత్రి నిర్ధారణకు వచ్చిన హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ వి.సతీష్ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన అక్కడికి బయలుదేరింది. దీంతో పోలీసుల చేతికి చిక్కక తప్పదనే భయంతో నూతనకుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
భర్త దగ్గరికి వెళ్లిపోతుందనే అక్కసుతోనే..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వెన్నవల్లి వారి పేటకు చెందిన బత్తుల నూతన కుమార్ విక్టర్ ఎంబీఏ చదివాడు. ఏలూరులోని ద్విచక్ర వాహనాల షోరూంలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న అతనికి అక్కడే పనిచేస్తున్న పల్లె పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను భార్యను విడిచిపెట్టి, పద్మతో సహజీవనం ప్రారంభించారు. నాలుగేళ్లుగా వీళిద్దరూ కలిసి ఉంటున్నప్పటికీ గత కొంతకాలంగా మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్లలో నూతనకుమార్‌పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా పద్మ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవటానికి నిశ్చయించుకోవటంతో నూతనకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నెల 23వ తేది రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుందని స్ధానికులు చెబుతున్నారు. భార్యను సైతం విడిచిపెట్టి పద్మ కోసం వస్తే, మళ్లీ ఆమె భర్త సూర్యనారాయణ దగ్గరకు వెళ్లిపోతుందనే అక్కసుతోనే ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏలూరులో నూతనకుమార్‌కు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని సైతం ఇటీవలే విక్రయించి, తద్వారా వచ్చిన రూ.35 లక్షలు కూడా పూర్తిగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పద్మ వెళ్లిపోవటం, తన ఆస్తిని కూడా పూర్తిగా కోల్పోవటంపై నూతన కుమార్ విచక్షణ కోల్పోయి ప్రతీకార చర్యకు ఉపక్రమించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పద్మ చేతులకు శస్త్రచికిత్స..
విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్యూటీషియన్ పద్మకు వైద్యులు సోమవారం శస్త్రచికత్స నిర్వహించారు. ఆమె రెండు చేతులు మణికట్టు పైభాగంలో కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా దెబ్బతినటంతో తొలుత చేతులు తొలగించాలని వైద్యులు భావించారు. కానీ పూర్తిస్థాయిలో ఆమెకు నిర్వహించిన టెస్ట్ రిపోర్టుల ఆధారంగా మణికట్టు పైభాగంలో శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె రెండు చేతులకు ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. మెడ వద్ద తీవ్ర గాయం కావటంతో హత్యయత్నం వివరాలను వెల్లడించే స్థితిలో లేదని తెలుస్తోంది.
నాభర్త ఆత్మహత్యకు పద్మే కారణం
తన భర్త ఆత్మహాత్యకు పద్మే కారణమని నూతన్‌కుమార్ భార్య సునీతకుమారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన నూతన కుమార్ విక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం నరసరావుపేట రైల్వే పోలీసులు ఆతని భార్య బత్తుల సునీతకుమారికి అప్పగించారు. ఆ సమయంలో పోలీసులకు సునీత ఇచ్చిన వాగ్మూలంలో తన భర్త మంచి వాడని, పద్మ వేసిన ఉచ్చులో పడి దారుణంగా మోసపోయాడని, తన భర్త మరణానికి పద్మే కారణమని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. 2014 వరకు తనతో ఎంతో అన్యోన్యంగా ఉండే వాడని, బైక్ షోరూంలో మేనేజర్‌గా పని చేశాడని చెప్పినట్లు సమాచారం. పద్మపై వ్యామోహాంతో ఆస్తిని సైతం నాశనం చేసుకున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment