
మోటార్ సైకిళ్లు, ఇద్దరు నిందితులతో భీమవరం వన్‌టౌన్ పోలీసులు
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ పి.చంద్రశేఖరరావు మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి 7 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలపై ఎస్సైలు కె.రామారావు, డి.హరికృష్ణతో కలిసి నిఘా పెట్టామన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఇద్దరు బాలురు ఉండటంతో జువైనల్ హోంకు పంపిస్తున్నట్లు చెప్పారు.
చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. మోటార్ సైకిల్స్ దొంగిలించిన తర్వాత వాటిపై తిరుగుతూ పెట్రోల్ అయిపోతే నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేస్తున్నారని చెప్పారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఆకివీడు మండలం గంగనామ్మకోడుకు చెందిన చింత నాని, కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన సరిళ్ల రాజారత్నంను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ టి.ముత్యాలరాజును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment