దేవనహళ్లి: కొందరి సరదా మరికొందరికి ప్రాణసంకటమవుతోంది. అయినా సరదారాయుళ్లలో మార్పు రావడంలేదు. ఈ కోవలోనే ఓ యువకుడి వీలింగ్(బైక్ విన్యాసాల) పిచ్చికి బాలిక బలైంది. హైదరాబాద్-బెంగళూరు రహదారిలోని దేవనహళ్లి తాలూకా బుళ్ళహళ్లి గేట్ వద్ద ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అంజలి అనే బాలిక తన తండ్రితో కలిసి మంచినీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఖరీదైన బైక్‌తో వీలింగ్ చేస్తూ ఆమెను ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో అంజలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. వీలింగ్ చేస్తూ అతడి వెనుకే వచ్చిన మరికొందరు యువకులను సైతం పట్టుకుని కొట్టి వారి ఖరీదైన బైక్‌లను ధ్వంసం చేశారు. వీకెండ్స్‌లో బెంగళూరు నుంచి వచ్చే యువకులు నందికొండ వరకూ వీలింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వీలింగ్‌ను అరికట్టాలని ఎంతోకాలంగా పోలీసులకు విన్నవించుకున్నా వారు చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ స్థానికులు గంటపైగా రాస్తారోకో చేపట్టారు. విజయపుర పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment