devanahalli
-
ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య
దొడ్డబళ్లాపురం: తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో నవ వధువును కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. సౌమ్య (23)హత్యకు గురైన వివాహిత. సుబ్రమణ్య (25) హత్య చేసిన నిందితుడు. సౌమ్య, సుబ్రమణి ఇద్దరూ గతంలో బెంగళూరు నాగవార వద్ద ఉన్న కాఫీడేలో పనిచేసేవారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం సౌమ్య హఠాత్తుగా పనిమానేసింది. రెండు వారాల క్రితం వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సౌమ్య తనను మోసం చేసిందని పగతో రగిలిపోయిన సుబ్యమణ్య సమయం కోసం వేచి చూసాడు. ఇలా ఉండగా బుధవారం సౌమ్య అవతికి వచ్చింది. అదే రోజు రాత్రి సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన సుబ్యమణ్య ఇంట్లో జొరబడి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు పరుగున రావడంతో సుబ్రమణ్య ఇంటి వెనుక నుంచి గోడదూకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పొద్దెక్కిన పావని నిద్రలేవలేదు..శరీరం పచ్చగా మారడంతో) -
వీరికి సరదా.. వారికి ప్రాణసంకటం
దేవనహళ్లి: కొందరి సరదా మరికొందరికి ప్రాణసంకటమవుతోంది. అయినా సరదారాయుళ్లలో మార్పు రావడంలేదు. ఈ కోవలోనే ఓ యువకుడి వీలింగ్(బైక్ విన్యాసాల) పిచ్చికి బాలిక బలైంది. హైదరాబాద్-బెంగళూరు రహదారిలోని దేవనహళ్లి తాలూకా బుళ్ళహళ్లి గేట్ వద్ద ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అంజలి అనే బాలిక తన తండ్రితో కలిసి మంచినీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఖరీదైన బైక్‌తో వీలింగ్ చేస్తూ ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అంజలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. వీలింగ్ చేస్తూ అతడి వెనుకే వచ్చిన మరికొందరు యువకులను సైతం పట్టుకుని కొట్టి వారి ఖరీదైన బైక్‌లను ధ్వంసం చేశారు. వీకెండ్స్‌లో బెంగళూరు నుంచి వచ్చే యువకులు నందికొండ వరకూ వీలింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వీలింగ్ను అరికట్టాలని ఎంతోకాలంగా పోలీసులకు విన్నవించుకున్నా వారు చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ స్థానికులు గంటపైగా రాస్తారోకో చేపట్టారు. విజయపుర పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారికి విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ఏడేళ్ల చిన్నారికి విషం ఇచ్చి భార్యతో కలిసి బంగారు ఆభరణాల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతం బెంగళూరు గ్రామీణ జిల్లా, దేవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కబళ్లాపురం జిల్లా చింతామణికి చెందిన సందీప్ 18 ఏళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడు. డిప్లొమా పూర్తి చేసి గాంధీబజార్లో జ్ఞానాక్షి జ్యువెలర్స ఏర్పాటు చేసి హనుమంత నగర్లో భార్య అర్చన (34), కుమార్తె ఆదితి (7)తో కలిసి నివాసం ఉంటున్నాడు. తాను కుటుంబ సభ్యులతో కలిసి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోతున్నామని, క్షమించాలని శుక్రవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో స్నేహితుడు వెంకటేశ్ బాబు సెల్‌కు సందీప్ ఎస్ఎంఎస్ పంపాడు. ఆ తర్వాత అతని సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ అయ్యింది. ఆందోళనకు గురైన స్నేహితులు, బంధువులు శుక్రవారం మధ్యాహ్నం వరకూ నగరమంతా గాలించారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రోడ్డులోని అమాని చెరువు వద్ద రోడ్డు పక్కన సందీప్ కారు(కేఏ-05,ఎంఎల్-861) ఉన్నట్లు మధ్యాహ్న సమయంలో సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా వెనుక సీట్లో సందీప్, అర్చన, ఆదితిలు విగతజీవులుగా కనిపించారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే దేవనహళ్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని అందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందీప్ కుటుంబానికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలు లేవని, ఈ అఘాయిత్యానికి ఎందుకు ఒడిగట్టారో అంతుబట్టడం లేదని సందీప్ సోదరరుడు గోపాల్ తెలిపాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.