దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ఏడేళ్ల చిన్నారికి విషం ఇచ్చి భార్యతో కలిసి బంగారు ఆభరణాల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతం బెంగళూరు గ్రామీణ జిల్లా, దేవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కబళ్లాపురం జిల్లా చింతామణికి చెందిన సందీప్ 18 ఏళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడు. డిప్లొమా పూర్తి చేసి గాంధీబజార్‌లో జ్ఞానాక్షి జ్యువెలర్‌స ఏర్పాటు చేసి హనుమంత నగర్‌లో భార్య అర్చన (34), కుమార్తె ఆదితి (7)తో కలిసి నివాసం ఉంటున్నాడు.
తాను కుటుంబ సభ్యులతో కలిసి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోతున్నామని, క్షమించాలని శుక్రవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో స్నేహితుడు వెంకటేశ్ బాబు సెల్‌కు సందీప్ ఎస్‌ఎంఎస్ పంపాడు. ఆ తర్వాత అతని సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ అయ్యింది. ఆందోళనకు గురైన స్నేహితులు, బంధువులు శుక్రవారం మధ్యాహ్నం వరకూ నగరమంతా గాలించారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రోడ్డులోని అమాని చెరువు వద్ద రోడ్డు పక్కన సందీప్ కారు(కేఏ-05,ఎంఎల్-861) ఉన్నట్లు మధ్యాహ్న సమయంలో సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా వెనుక సీట్లో సందీప్, అర్చన, ఆదితిలు విగతజీవులుగా కనిపించారు.
విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే దేవనహళ్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని అందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందీప్ కుటుంబానికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలు లేవని, ఈ అఘాయిత్యానికి ఎందుకు ఒడిగట్టారో అంతుబట్టడం లేదని సందీప్ సోదరరుడు గోపాల్ తెలిపాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారికి విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
Published Sat, Aug 24 2013 2:34 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement