ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ | Bollaram SI, Constable Caught by ACB | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 17 2019 8:49 PM | Last Updated on Mon, Jun 17 2019 8:56 PM

Bollaram SI, Constable Caught by ACB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఓ కేసు విషయమై రూ.20 వేల లంచాన్ని ఫోన్‌ పే ద్వారా తీసుకున్న బొల్లారం ఎస్‌ఐ  బ్రహ్మచారి, కానిస్టేబుల్‌ నగేష్‌లను సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌2 డీఎస్పీ ఎస్‌.అచ్చేశ్వర్‌ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ఆదర్శనగర్‌కు  చెందిన జనగాం నర్సింగ్‌రావు బ్యాండ్‌మేళా నిర్వహిస్తుంటాడు. నర్సింగ్‌రావు వద్ద పనిచేసే వర్గల్‌కు చెందిన గోపీ అడ్వాన్స్‌గా రూ.18వేలు తీసుకుని ఏడాదిగా పనిలోకి రావడం లేదు. అకస్మాత్తుగా ఈ నెల 2వ తేదీన రోడ్డుపై కలవడంతో పనికి ఎందుకు రావడం లేదని గోపీని నిలదీయగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే గోపీపై నర్సింగ్‌రావు చేయిచేసుకున్నాడు. దీంతో గోపీ తన యాజమాని నర్సింగ్‌రావుపై ఈ నెల 3వ తేదీన బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నర్సింగ్‌రావుపై సెక్షన్‌ 324, 384 కింద కేసు నమోదు చేశారు. 

పోలీసులు విచారణ నిమిత్తం పిలిచినా రాకుండా  నర్సింగ్‌రావు కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో  కానిస్టేబుల్‌ నగేష్‌ ద్వారా ఎస్‌ఐ బ్రహ్మచారికి రాయబారం నడిపాడు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటే  రూ. 20వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. స్టేషన్‌ బెయిల్‌ నిమిత్తం కానిస్టేబుల్‌ నగేష్‌ ఈ నెల 13వ తేదీన నర్సింగ్‌రావు ఇంటికి రావడంతో ఆయన భార్య అంభికా మొదటి విడతగా కానిస్టేబుల్‌కు రూ.10వేల నగదును ఇచ్చింది. నర్సింగ్‌రావు ఇంటి ఎదురుగా ఉన్న టెంట్‌హౌజ్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. అనంతరం రెండు రోజుల తరువాత మిగతా డబ్బులు ఫోన్‌ పే చేయాలని కానిస్టేబుల్‌ నగేష్‌ నర్సింగ్‌రావు భార్య అంబికకు ఫోన్‌ చేశాడు. అకౌంట్‌ నంబర్‌ పంపివ్వాలని ఆమె సూచించగా వాట్సాప్‌లో అకౌంట్‌ నంబర్‌ పంపగా, ఆ అకౌంట్‌ నంబర్‌కు రూ.10వేలు బదిలీ చేసింది. 

అనంతరం కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ విషయం ఎస్‌ఐకి చెప్పాలనగా కానిస్టేబుల్‌ నగేష్ కాన్ఫరెన్స్‌ కలిపాడు. డబ్బులు పంపించినట్లు ఆమె చెప్పిన విషయాన్ని విన్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్‌ బెయిల్‌ వస్తుందనుకున్న నర్సింగ్‌రావుకు మాత్రం నిరాశే మిగిలింది. బెయిల్‌ ఇవ్వాలంటే టీఆర్‌ఎస్‌ నేత వేణుగోపాల్‌రెడ్డిని వెంటబెట్టుకుని స్టేషన్‌కు రావాలని ఎస్‌ఐ బ్రహ్మచారి తనకు సూచించాడని  నర్సింగ్‌రావు అన్నారు. ఇదిలా ఉండగా మరోసారి తన ఇంటికి వచ్చిన కానిస్టేబుల్‌  రూ.5వేలు కావాలని డిమాండ్‌ చేశాడని తెలిపాడు. డబ్బులు ఇచ్చినా స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వకుండా, కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుండడంతో నగర ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు  సీసీ కెమెరాల రికార్డుతో పాటు ఫోన్‌లోని వాట్సాప్, ఆడియోలను పరిశీలించి, పూర్తి ఆదారాలతో సోమవారం బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్‌ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement