
సాక్షి, అన్నానగర్: జామకాయ.. పిల్లలకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని ఆనైమలైలో జరిగింది. స్థానిక మొయిదిన్‌ఖాన్ వీధికి చెందిన సిరాకోవిన్ కుమారుడు అన్సాద్ (14) ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తూ క్లాసులో తినేందుకు జామకాయతోపాటు చిన్న కత్తిని వెంట తీసుకెళ్లాడు. ఉదయం 10.15 గంటలకు మొదటి క్లాస్ ముగియగానే ఉపాధ్యాయిని తరగతి నుండి బయటకు వెళ్లింది.
ఆ విరామ సమయంలో అన్సాద్ తాను తెచ్చిన జామకాయను తొడమీద ఉంచుకుని కత్తితో చిన్నముక్కలుగా చేస్తున్నాడు. ఇంతలో కత్తి హఠాత్తుగా ఎడమ తొడను చీల్చింది. దీంతో తొడ నుండి గుండెకు వెళ్లే ముఖ్యమైన నరం తెగిపోగా అతడు రక్తపుమడుగులో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి అన్సాద్ మార్గం మధ్యలోనే మృతిచెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తోటి విద్యార్థులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment