లక్ష్మణరావుతో కలిసి దిగిన ఫొటోలు చూపుతున్న బాధితురాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రేమించానని మాయమాటలు చెప్పి తనను మోసంచేశాడని ఓ యువతి మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. కొత్తపేట నెహ్రూ సెంటర్‌కు చెందిన ఓ యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అన్నకు మతిస్థిమితం లేదు. టీఎంహెచ్ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేయడంతో పాటు ఇళ్లల్లో పాచిపనిచేస్తూ జీవనం సాగిస్తోంది. స్కూల్‌లో పనిచేస్తున్న సమయంలో చిట్టినగర్‌కు చెందిన పొట్నూరి లక్ష్మణరావు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకు పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గుడులు, పార్కులు తిప్పాడు. తన అక్క పెళ్లి తర్వాత తానూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా పెళ్లి విషయం ప్రస్తావించే సరికే తనకు ఏ సంబం«ధం లేదంటూ తిరస్కరించాడని బాధితురాలు వాపోయింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఫోన్ స్విచాఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపింది.
పోలీసులు, పెద్దల బెదిరింపులు
తనకు జరిగిన అన్యాయంపై నగర పోలీస్ కమిషనర్‌ను కలిశానని, ఆయన టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తనను పంపారని చెప్పింది. అక్కడ పోలీసులు తనకు న్యాయం చేయలేదని, పైగా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. పోలీసులు లెటర్ రాసి తనతో సంతకం పెట్టించుకున్నారని వాపోయింది. పెద్దమనుషులు కూడా తనను బెదిరిస్తున్నారని, డబ్బులు ఇప్పిస్తాం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపింది. పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తారని పెద్దమనుషులే చెబుతున్నారని, అనాథను తనను ఆదుకోవాలని వేడుకుంది. తాను ప్రేమించిన వ్యక్తితో తనకు పెళ్లి చేయాలని కోరింది. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని కోరింది.
అండగా నిలిచిన ఇరుగుపొరుగు
తన ఇంటి ఇరుగుపొరుగు వారితో కలిసి బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో తన గోడు వినిపించింది. ఆమె సహాయకురాలు రాజకుమారి మాట్లాడుతూ ఎనిమిది నెలలపాటు ప్రేమించానని చెప్పిన అతడు పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఆమె అనాథ కావడంతో తామంతా అండగా నిలిచామన్నారు. మీనాకు న్యాయం చేయాలని కోరారు. అవసమైతే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరతామని తెలిపారు. సమావేశంలో హనుమంతరావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment