కిడ్నాప్ అయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన ఏసీపీ మహేందర్ చిట్టాపురం పరమేశ్ (లక్కీ)
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ పట్టణం యూకో బ్యాంక్ వెనుక వీధిలో రెండేళ్ల బాలుడు అపహరణకు పట్టణంలో కలకలం సృష్టించింది. పున్న శ్రీమతి, రాజయ్య కూతురు స్రవంతిని నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. శుక్రవారం ఇంటి ముందు ఆడుకునే బాలుడు చిట్టాపురం పరమేశ్ (లక్కీ) కనిపించకుండా పోయేసరికి తల్లి ఆందోళన చెంది అమ్మనాన్నలకు చెప్పింది. తల్లి స్రవంతి, అమ్మనాన్నలు వీధి వీధి గాలించిన బాలుడు ఆచూకి దొరకపోవడంతో తల్లి స్రవంతి అమ్మ నాన్నల సహాయంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలుడి కిడ్నాప్‌ను చేధించేందుకు పోలీసులు రంగంలోకి బృందాలు ఏర్పడి తీవ్రంగా శ్రమించి ఐదు గంటల్లో కేసు చేధించి బాలుడికి ఎలాంటి గాయాలు లేకుండా తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. కొత్త సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా బాలుడు కిడ్నాప్ కావడం పోలీసుల కేసు చేధనను సవాల్‌గా తీసుకోని విచారణ చేపట్టారు. బాలుడు కిడ్నాప్ అయిన వీధిలో గణేష్ భవన్ వెనుక సీసీ కెమెరా ఉండటం అందులో కిడ్నాప్ చేసిన వ్యక్తి గుర్తించేందుకు సహాయ పడింది.
మడద గ్రామ పరిధిలోని బంటుపల్లికి చెందిన పోలోజు నాగరాజు మద్యం సేవించి బాలుడికి అరటిపళ్లు ఇస్తానని తీసుకెళ్లి అపహరించినట్లు గుర్తించి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసు చేధించేందుకు గాలింపు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్ బృందం అక్కడకు వెళ్లి నాగరాజు, బాలుడుని అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు బాలుడిని ఏసీపీ మహేందర్ తల్లిదండ్రులకు అప్పగించారు.
సీసీ కెమెరాల సహాయంతో..
హుస్నాబాద్ పట్టణంలోని వ్యాపారులు ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే కిడ్నాప్ కేసును ఐదు గంటల్లో చేధించడం జరిగిందని ఏసీపీ సందేపోగు మహేందర్ అన్నారు. పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలకు 15 గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అక్కన్నపేట మండలంలో 32 గ్రామాలకు 12 గ్రామాల్లో సీసీ కెమెరాలు బగించామని, కోహెడ మండలంలో 27 గ్రామాలకు 10 గ్రామాల్లో సీసీ కెమెరాలు బిగించడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడటంతో గ్రామాలకు వచ్చే దొంగలను, అపరిచిత వ్యక్తుల చిత్రాలను బంధించి కేసుల చేధనకు సహకారం అందిస్తున్నాయన్నారు.
సీసీ కెమెరాలు లేని గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కిడ్నాప్ అయిన బాలుడికి ఎలాంటి హాని కలుగకుండా సురక్షితంగా పట్టుకోగలిగామంటే సీసీ కెమెరాల ఫుటేజీలు ప్రధాన భూమిక పోషించాయన్నారు. బాలుడి కిడ్నాప్‌ను చేధించిన ఎస్సై సుధాకర్, ఏఎస్సై మోతిరాం, కానిస్టేబుల్స్ త్యాగరాజు, రవి, హెడ్‌కానిస్టేబుల్ సంపత్‌లను ఏసీపీ అభినందించారు. నిందుతుడిని విచారణ అనంతరం శనివారం కోర్టులో హాజరుపర్చుతామని చెప్పారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట, హుస్నాబాద్ ఎస్సైలు సుధాకర్, పాపయ్యనాయక్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment