సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామ శివారు ఇటుక బట్టీలో సోమవారం కలకలం రేపిన బాలుడి హత్య ఘటన మిస్టరీని 24గంటలలోపు మామునూరు పోలీసులు ఛేదించారు. ఓ మహిళతో యువకుడు కొనసాగిస్తున్న అక్రమ సంబంధం ఆమె కుమారుడికి తెలిసిందన్న కారణంతో పొట్టన పెట్టుకున్నట్లే తెలిసింది. ఈ మేరకు మామునూరు పోలీస్ స్ట్రేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు.
ఒడిస్సా నుంచి నక్కలపల్లికి..
ఒడిస్సా రాష్ట్రం బలంగిరి జిల్లా సోమేశ్వర్ గ్రామానికి చెందిన బోయి సంజుతో అదే జిల్లా డైడుమారి గ్రామానికి చెందిన ఆవివాహతుడైన బంగుల నృత్యకైరా(24) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాగా వరంగల్ ఇటుక బట్టీల్లో కూలి పనిచేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి రెండు నెలల క్రితం ఆయన తమ్ముళ్లతో పాటు తాను అక్రమ సంబంధం కొనసాగిస్తున్న బోయి సంజు, ఆమె భర్త, ముగ్గురు పిల్లలను తీసుకుని ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లికి వచ్చాడు. అందరూ ఒకే ఇటుక బట్టీలో కూలి పని చేస్తున్నారు. కాగా, సంజు పెద్ద కుమారుడు బోయి దినేష్(11) ఇంటి వద్దే ఉంటుండగా... సంజుతో నృత్యకు ఉన్న సంబంధం ఆ బాలుడికి తెలిసిందని నృత్య అనుమానించాడు.
ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని ఈనెల 12న ఆదివారం మధ్యాహ్నం దినేష్‌ను బహిర్బూమికి అని చెప్పి ఇంటి నుంచి బలవంతంగా నక్కలపెల్లి చెరువు వద్ద ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ దినేష్ మెడకు తువ్వాల బిగించి గట్టిగా లాగి హత్య చేసి పారిపోయాడు. దినేష్ కనిపించడంలేదని వెతుకున్న క్రమంలోనే సోమవారం ఉదయం శవమై కనిపించగా... మామునూరు పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసి 24 గంటల్లోనే నేరస్తుడు నృత్య కైరా(24)ను అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. కాగా, నిందితుడు బాలుడి తల్లికి తెలియకుండా ఈ ఘటనకు పాల్పడ్డారని తేలినట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, ఏసీపీ శ్యాంసుందర్, సీఐ సార్ల రాజును సీపీ రవీందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో మామునూరు ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు, గీసుగొండ ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment