నిందితుడు రితీష్, ఐశ్వర్య
ప్రేమోన్మాది ఘాతుకానికి కోయంబత్తూరులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రేమించిన యువతినే అతికిరాతకంగా కడతేర్చాడు. అడ్డు వచ్చిన ఆమె తండ్రిపై దాడి చేసి పరారయ్యాడు.
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు నగరం పరిధిలోని పేరూర్ ఎంఆర్ గార్డెన్‌కు చెందిన శక్తి వేల్ కుమార్తె ఐశ్వర్య(18) పేరూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఎంఆర్ గార్డెన్‌కు చెందిన రితీష్(24)తో ఐశ్వర్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు లాక్‌డౌన్ అడ్డంకిగా మారింది. ప్రియురాలిని చూడలేని పరిస్థితుల్లో తీవ్ర మనో వేదనలో పడ్డ రితీష్ ఓ రోజు సాహసం చేశాడు. ఆమె ఇంటి వద్దకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో రితీష్‌ను ఐశ్వర్య కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించారు. ఐశ్వర్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి రితీష్‌ను దూరం పెట్టి ఇంటికే పరిమితమైంది.
ఉన్మాదిగా..
పలుమార్లు ఆమెతో మాట్లాడేందుకు రితీష్ ప్రయత్నించాడు. అయితే ఐశ్వర్య పట్టించుకోలేదు. అంతే కాదు అతడి ప్రేమను నిరాకరించడం మొదలెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రతీష్ ఉన్మాదంతో రగిలిపోయాడు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమిస్తున్నావా..? లేదా అని ప్రశ్నించాడు. ఆమె రితీష్ నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. తాను ప్రేమించడంలేదని ఐశ్వర్య చెప్పగానే ఉన్మాదిగా మారిన అతగాడు వెంట తెచ్చుకున్న కత్తితో ఇష్టానుసారంగా దాడి చేశాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఐశ్వర్య తండ్రి శక్తి వేల్ ఆందోళనకు గురయ్యాడు. (బాలికపై సామూహిక అత్యాచారం)
తన కుమార్తెను కత్తితో పొడిచేస్తున్న ఆ ఉన్మాదిని అడ్డుకునేందుకు యత్నించాడు. అయితే, ఆ ఉన్మాది ఆయన్ను కూడా వదలి పెట్ట లేదు. ఆయన్ను సైతం తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. శక్తి వేల్ కేకలతో ఇరుగు పొరుగు వారు అక్కడికి పరుగులు తీశారు. రక్తపు మడుగులో పడివున్న తండ్రీకుమార్తెలను ఆస్పత్రికి తరలించారు. కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం ఐశ్వర్య మృతి చెందింది. సమాచారం అందుకున్న కోయంబత్తూరు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రేమోన్మాది కోసం గాలిస్తున్నారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment