
మృతుడు గజమన్, సీసీటీవీలో దాడి దృశ‍్యం
న్యూయార్క్ : ఓ యువకుడికి సంబంధించిన వ్యక్తిగత వీడియో మరో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఉదంతం న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌కు చెందిన లెసాండ్రో గజ్‌మన్ ఫెలిజ్(15)ను గత గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొంత మంది యువకులు కత్తులతో వెంబడించారు. అతడు ప్రాణభయంతో దగ్గరలోని ఓ దుకాణంలోకి పరుగులు తీసినా విడిచి పెట్టలేదు. దుకాణం లోపల దాక్కున్న అతన్ని బయటకు లాగి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తి పోట్లతో ఉన్న గజ్‌మన్ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొద్ది దూరం పరుగులు తీసిన వెంటనే అతను ఓ చోట కుప్పకూలిపోయాడు.
రక్తపు మడుగులో ఉన్న అతన్ని గుర్తించిన కొందరు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గజ్‌మన్ మృతి చెందాడు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. ఓ యువకుడు తన మిత్రుడి సోదరితో కలిసి ఉన్న వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో ఉంచాడని, ఆ యువకుడిని చంపాలనుకుని పొరపాటున అదే పోలికలతో ఉన్న గజ్‌మన్‌ను చంపామని వారు తెలిపారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment