
రమేష్, మల్లేష్ మృతదేహాలతో రోడ్డుపై ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు
ఉరవకొండ: రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకునే అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
► స్థానిక బాలాజీ థియేటర్ ఎదురుగా ఎస్సీ కాలనీలో నివసిస్తున్న అన్నదమ్ములు రమేష్ (55), మల్లేష్ (52) రిక్షా తొక్కుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
► సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రమేష్ ఇంటికి సంబంధించిన విద్యుత్ సర్వీసు వైరు తెగిపోయి పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకు కంచెపై పడింది.
► ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన రమేష్ ట్యాంకు వద్ద ఉన్న కంచెను ముట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలాడు.
► అన్న కింద పడటం గమనించిన తమ్ముడు మల్లేష్ పరుగెత్తుకుని వెళ్లి కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మల్లేష్ కూడా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు.
► కొద్ది సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
► విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట మృతదేహాలతో నిరసనకు దిగారు.
► అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
► పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
► రమేష్‌కు భార్య రాధమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లేష్‌కు భార్య తిప్పమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment