
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు
మెదక్‌రూరల్: ప్రేమించిన పాపానికి ఇంత కిరాతకంగా చంపేస్తారా..? అంటూ మృతుడి బంధువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. బండరాయితో మోదీ ముఖాన్ని గుర్తుపట్టరానంతగా చిధ్రం చేసి , శరీరంపై కత్తితో పొడిసి, మర్మాంగాలపై రాళ్లను పడేసి అతీ కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మహ్మద్ గఫ్ఫర్‌ఖాన్–ఆసియాలకు ఇద్దరు కుమారులున్నారు.
రెండో కుమారుడు మోహీన్‌ఖాన్(22) రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఇతర ప్రాంతానికి కొద్ది రోజులు తీసుకెళ్లారని, ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ యువతిని తీసుకొచ్చి అప్పగించినట్లు తెలిపారు. ఈ విషయంలో మోహీన్‌పై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మెదక్ కోర్టులో సోమవారం పేషీకి హాజరై రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు బస్‌లో తిరుగు పయాణమయ్యాడు.
బస్సులో ప్రయాణించాల్సిన మోహీన్ మెదక్–చేగుంట ప్రధాన రహదారి పక్కన ఖాజీపల్లి గ్రామ శివారులో దుండగుల చేతిలో అతికిరాతకంగా హత్యకు గురయ్యాడు. శరీరంపై కత్తితో పోడిసి, ముఖాన్ని గుర్తుపట్టరాని విధంగా బండరాయితో మోది కిరాతకంగా చంపేసి రోడ్డు పక్కనే పడేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమిస్తే చంపుతారా..?
హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఏపీ13జీ7809 ఇండికా కారును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ప్రేమించిన పాపానికే చంపేసి ఉంటారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మోహీన్‌పై ఇప్పటికే హత్యాయత్నం, అత్యాచారం కింద రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెపుతున్నారు. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌లు లింబాద్రి, శ్రీకాంత్, సందీప్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
క్లూస్‌టీం బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యానేరంగా పోలీసులు కేసు నమోదుచేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ క్రమంలో మృతుడి బంధువులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. దీంతో త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పోస్టుమార్టంకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment