![Bulandshahr Molestation Main Accused Dies Of Kidney Problem - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/17/representational.jpg.webp?itok=7cRS1mtd)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బులంద్‌షహర్ సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సలీం బవారీ మృతి చెందాడు. కిడ్నీ వ్యాధితో బాధ పడతున్న అతడు ప్రభుత్వాసుపత్రిలో మరణించాడు. సలీం బవారియా అనే వ్యక్తి 2016లో తన స్నేహితులతో కలిసి బులంద్‌షహర్ వద్ద ఓ కుటుంబాన్ని అడ్డగించాడు. ఢిల్లీ- కాన్పూర్ జాతీయ రహదారి గుండా వెళ్తున్న వారిపై దాడి చేసి.. మగవాళ్లందరినీ చెట్టుకు కట్టేసి పదమూడేళ్ల బాలిక, ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సలీం బవారియాతో పాటుగా అతడి స్నేహితులు జుబేర్, సాజిద్‌లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం వీరంతా బులంద్‌షహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సలీం ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో అతడిని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా... డయాలసిస్ నిర్వహించారు. అయితే సలీం ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారడంతో అతడిని తిరిగి బులంద్‌షహర్‌కు తీసుకురాగా మృతి చెందాడని జిల్లా ఎస్పీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సామూహిక అత్యాచార కేసులో మిగిలిన నిందితులు ఇద్దరూ బులంద్‌షహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment