సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మానసిక పరిస్థితి కాస్తా ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. ఈ విషయం గురించి ఒక పోలీస్ అధికారి చెబుతూ.. ‘ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పాపం చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటంతో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే’ అని తెలిపారు.
ఈ కేసు విచారణ పూర్తయిన వెంటనే ఉద్యోగుల కోసం ఒత్తిడి నివారణ కార్యక్రమాలు నిర్వహించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంతేకాక కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్‌లో యాగం, శాంతి హోమం వంటి పూజలు చేయమని సలహా కూడా ఇచ్చారన్నారు. అయితే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక కొంత గడువు ఇవ్వమని కోరామన్నారు. ఎందుకంటే 15 లక్షల జనాభాతో దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించిన బురారీ రక్షణ బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వడం కూడా మా విధుల్లో భాగమే, కనుక ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు అని పోలీసు ఉన్నాతాధికారి తెలిపారు.
ఇదిలావుండగా బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతాన్ని నిత్యం టీవీల్లో చూసి ప్రభావితమైన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment