కారు–నాన్‌స్టాప్‌ బస్సు ఢీ | car and bus collided | Sakshi
Sakshi News home page

కారు–నాన్‌స్టాప్‌ బస్సు ఢీ

Published Sun, Mar 18 2018 12:39 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

car and bus collided - Sakshi

ఎడమవైపు తుప్పల్లోకి పోయిన బస్సు, కుడివైపు బోల్తా పడిన చెరకు ట్రాక్టరు, నుజ్జయిన కారు (అంతర్‌చిత్రం) కారు సీటులోనే మృతి చెందిన అనిల్‌దాసు, సమాచారం సేకరిస్తున్న సీఐ

సామర్లకోట : సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డ్రైవరు వాహనంలోనే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం కాకినాడలో జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఎం.రాజబాబు వద్ద వడ్డి అనిల్‌దాసు(35) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. రాజబాబును శనివారం కాకినాడలో దింపిన అనిల్‌దాసు రాజమహేంద్రవరం వెళ్తూ ఉండగా జ్యోతుల గొడౌన్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న నాన్‌స్టాప్‌ బస్సును ఢీ కొనడంతో కారు ముందుభాగం నుజ్జయ్యింది. డ్రైవింగ్‌ చేస్తున్న అనిల్‌దాసు అక్కడికక్కడే మృతి చెందాడు.

శనివారం ఉదయం చినుకుల పడడంతో కారు అదుపు తప్పి బస్సును ఢీకొంది. దాంతో నాన్‌స్టాప్‌ బస్సు కుడివైపు ఉన్న తుప్పల్లోకి పొయింది. వెంటనే డ్రైవరు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మరో బస్సులో కాకినాడకు తరలించారు. నాన్‌స్టాప్‌ వెనుక పెద్దాపురం మండలం తూర్పు పాకల నుంచి వస్తున్న చెరకు ట్రాక్టరు డ్రైవర్‌ ఈ ప్రమాదాన్ని గమనించి బ్రేక్‌ వేయడంతో ఎడమ వైపు నుంచి వస్తున్న  ట్రాక్టరు కుడివైపు రోడ్డు మార్జిన్‌లో తుప్పలో బోల్తా పడింది. ట్రాక్టరు డ్రైవరును స్థానికులు వెంటనే బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.

రోడ్డు మార్జిన్‌లో కారు, రోడ్డుకు అడ్డుగా బస్సు నిలిచి పోవడంతో సామర్లకోట–పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌ రామారావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, కాకినాడ జాయింట్‌ 1 రిజిస్ట్రార్‌ రాజబాబు, సామర్లకోట సబ్‌ రిజిస్ట్రార్‌ కె.సుందరరావులు సంఘటన ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌ ఎస్సై సతీష్‌ తన సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై ఎల్‌. శ్రీనివాసనాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న డ్రైవరు సీటు బెల్టు పెట్టుకుని ఉంటే కొంత వరకు ప్రమాదం తప్పేదని స్థానికులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement