గురునాథం (ఫైల్);ఇంటి వద్ద రోదిస్తున్న గురునాథం తల్లి రమణ
సాక్షి, గరిడేపల్లి (హుజూర్‌నగర్): అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ సజీవ దహనం విషయంలో మృతి చెందిన కామళ్ల గురునాథం మృతదేహం మంగళవారం రాత్రి 7గంటలకు స్వగ్రామమైన వెలిదండకు చేరింది. గ్రామానికి మృతదేహం చేరగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. భార్య సౌందర్య, తల్లి రమణమ్మ, తండ్రి బ్రహ్మయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. కోదాడ రూరల్ ఎస్‌ఐ సైదులు, గరిడేపల్లి ఎస్‌ఐ వెంకన్న, ఏఎస్‌ఐ నాగేశ్వరరావుతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. గురునాథంకు బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఘటనలో ఆమెను కాపాడబోయి మంటల్లో కాలి గాయాలైన కారు డ్రైవర్ కామళ్ల గురునాథం అలియాస్ గురుపాదం (29) చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన కామళ్ల బ్రహ్మయ్య, రమణమ్మ పెద్ద కుమారుడు గురునాథం బతుకు దెరువు కోసం ఏడేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. సుతారి పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకుని విజయారెడ్డి వద్ద ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డి కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ అక్కా అని విజయారెడ్డిని పిలిచేవాడు. ఆమెతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. మంటల్లో ఆమె చిక్కుకున్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆయన కూడా 75 శాతం కాలిపోయాడు. గాయపడిన గురునాథాన్ని చికిత్స కోసం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా గురునాథంకు భార్య సౌందర్యతో పాటు ఏడాదిన్నర పాప ఉంది. భార్య ప్రస్తుతం గర్భవతి.
గ్రామంలో మిన్నంటిన రోదనలు
గురునాథం మరణవార్త విని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం ఇంటి వద్ద తల్లి రమణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గురునాథం ఇంటి వద్దకు బంధువులు, స్నేహితులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఎంతో నమ్మకస్తుడని కొనియాడారు. మండల ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజరవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, సర్పంచ్ ఆదూరి పద్మ, ఎంపీటీసీ ములకలపల్లి విజయతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గురునాథం ఇంటి వద్ద గరిడేపల్లి ఎస్‌ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పరామర్శించిన
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి...
గురునాథం మృతదేహాన్ని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. సోమవారం జరిగిన ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి, గురునాథం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. బాధితుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృతికి సంతాపం...
గ్రామానికి చెందిన యువకులు పాఠశాలకు చేరుకుని గురునాతం మృతికి సంతాపంగా నల్లబ్యాడ్జీలు ధరించి, మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీవీ రాము, బాలస్వామి, ఉపాధ్యాయులు బుచ్చారావు, కేవీ సత్యనారాయణ, కళావతి, ప్రశాంతి, సువర్ణ, రంగయ్య, లక్ష్మయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రకళ, నవ్య, గ్రామ యువకులు నాగరాజు, గోపి, శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment