పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి
నగరి : మండలంలోని ఓజీకుప్పం గ్రామాన్ని ఆదివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టి తనిఖీ నిర్వహించారు. కార్డన్ అండ్ సెర్చ్ (సమస్యాత్మక పల్లెల్ని చుట్టుముట్టి తనికీ చేయడం)లో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, చిత్తూరు అడిషనల్ ఎస్పీ కృష్ణార్జునరావు, చిత్తూరు ఎస్బీ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, చిత్తూరు ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నగరి, నగరి రూరల్, పుత్తూరు సీఐలు మద్దయ్య ఆచారి, రాజశేఖర్, వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఐలతో పాటు 100 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీ చేశారు. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి అనుమానిత వ్యక్తులు ఉన్నారా అని ఆరాతీశారు. ఇళ్ల వద్ద ఉన్న వాహనాల రికార్డులను తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో ఊహించని పలు అంశాలు వెలుగుచూశాయి. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పళని(48), మునస్వామి(28), మురళి (32), సంపూర్ణమ్మ(70) పట్టుపడగా, వారి వద్ద నుంచి 12.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా సారా, మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న దొరై(60), మునిలక్ష్మి (56)ని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 114 సారాపాకెట్లు, 11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని 11 ద్విచక్రవాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి నిల్వ ఉంచుకున్న వారిపై ఎన్‌ఈబీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయగా, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై ఏపీ ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment