![Case Against Journo Madhya Pradesh Attendes Press Meet Corona Virus Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/28/coronavirus-9.jpg.webp?itok=d_qR3Z5Z)
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ ముఖ్యమంత్రి స్థానంలో చివరిసారిగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశానికి సదరు జర్నలిస్టు హాజరయ్యారు. ఆ తర్వాత ఆ జర్నలిస్టులో కరోనా లక్షణాలు బయటపడటంతో వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు జర్నలిస్టు వివరాలపై ఆరా తీయగా.. లండన్ నుంచి వచ్చిన కూతురితో సదరు వ్యక్తి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని తేలింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌కు హాజరై నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. (లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన సబ్ కలెక్టర్?! )
ఇదిలా ఉండగా భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 873కు చేరింది. 19 మరణాలు సంభవించాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 159కు చేరుకుంది. శనివారం కొత్తగా అక్కడ ఆరు కేసులు(ముంబై-5, నాగ్‌పూర్-1)నమోదయ్యాయి.(కరోనా: 873కు చేరిన కేసులు.. 19 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment