సాక్షి, భోపాల్ : మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అడిషనల్ ఎస్పీపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. తనకు న్యాయం చేయాలంటూ లైంగిక వేధింపుల వీడియోలను ఉన్నతాధికారుకు పంపడంతో సస్పెండ్ చేస్తామంటూ తొలుత ఆమెను బెదిరించారు. చివరికి ఆమె విషయం మీడియాకు తెలియడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధమయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డ్యూటీ వేశారు. అయితే అక్కడ అదనపు ఎస్పీ రాజేంద్రన్ వర్మ ఆ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ ఎంతో తెలివిగా.. రాజేంద్రన్ వర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో వీడియో, ఫొటోలు తీశారు. వీటిని ఆధారాలుగా సమర్పిస్తూ.. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేయగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆడియో, వీడియోలు చూసిన తర్వాత.. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ ఆ బాస్ హెచ్చరించారు. అయితే విషయం మీడియా దృష్టికి రావడంతో లాభంలేదని భావించిన ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ రాజేంద్రన్ వర్మపై విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment