వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి
సాక్షి, అనంతపురం సెంట్రల్: వీరనారాయణస్వామి గుడి అర్చకత్వం విషయంలో సొంత దాయాదిని హతమార్చారు. నార్పల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఈనెల 20న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. నిందితుల వివరాలను సోమవారం డీఎస్పీ వీరరాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నల్లపరెడ్డిపల్లి గ్రామంలో కుంటాల వీరనారప్ప ఈనెల 20న దారుణహత్యకు గురయ్యాడు. సదరు గ్రామంలో వీరనారాయణస్వామి గుడి అర్చకత్వం విషయంలో మృతుడు వీరనారప్పకు వరుసకు పెదనాన్న అయిన పెద్దవీరనారప్ప మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అడుగడుగునా అడ్డు తగులుతుండడంతో పాటు గ్రామంలో మంచి పేరును పెద్ద వీరనారప్ప జీర్ణించుకోలేకపోయాడు. వంశపారపర్యంగా వచ్చిన గుడి అర్చకత్వం విషయంలో అడ్డుపడుతున్నాడు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ప్రతి శివరాత్రి నుంచి మరుసటి శివరాత్రి వరకూ పూజారిగా ఉండాలని నిర్ణయించారు.
దీన్ని పెద్ద వీరనారప్ప కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఇప్పటికిప్పుడే అర్చకత్వం కావాలని పట్టుపట్టారు. దీంతో ఎలాగైనా పూజారిగా ఉన్న వీరనారప్ప హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 20న ఉదయం 9 గంటల సమయంలో వీరనారప్పను అతని పెద్దనాన్న పెద్ద వీరనారప్ప, అతని కుమారులు నాగార్జున, నాగేంద్రలు కలిసి కట్టెలు కొట్టి, కొడవలితో నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి భార్య ఉజ్జనేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్పల పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. పెద్ద మనుషులతో పరిష్కారం అయ్యే సమస్యను కూడా హత్య వరకూ వెళ్లారని, క్షణికావేశాలకు లోను కాకుడదని ప్రజలకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచించారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్, నార్పల ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment