
నిందితున్ని చూపుతున్న పోలీసులు
సాక్షి, కంబదూరు: మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నరాయుడు కుమారై నందిని (22) మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాజేష్ వెల్లడించారు. నందిని, కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన నరేష్ ప్రేమించుకున్నారు. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నరేష్‌పై ఒత్తిడి చేసింది. ఇష్టం లేని అతను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
చదవండి: (పెళ్లైన 13 రోజులకే.. సచివాలయ ఉద్యోగి బలవన్మరణం)
ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఈ నెల 13న బైక్‌పై దేవరమాన్ల నుంచి తిమ్మాపురం వైపు వెళ్లే కపిలబండ పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా పురుగు మందు తాపి హత్య చేశాడు. కాగా.. నందిని మృతదేహాన్ని ఈ నెల 18న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే మృతదేహం పాడైంది. పక్కనే పురుగు మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు. కానీ పోస్టుమార్టంలో ఆమె గర్భవతి అని తేలింది. ఆమె అన్న కుళ్లాయిస్వామికి అనుమానం వచ్చి కంబదూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. నందినిని నరేష్ హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అతన్ని మంగళవారం నూతిమడుగు సమీపంలో అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment