
సాక్షి, గన్నవరం: డ్వాక్రా గూపు సభ్యురాలి సంతకాల ఫోర్జరీతో ధాన్యం కొనుగోలు లావాదేవీలు చేసిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యురాలు, ఆమె కుమార్తెపై కోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గన్నవరం మండలం దావాజిగూడెం ఉజ్వల గ్రామ సమాఖ్య సంఘంలోని రసూల్ స్వయం సహాయక సంఘంలో షేక్ రిజ్వానా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 2016, ఫిబ్రవరిలో మూడుసార్లు మొత్తం రూ.7.60 లక్షలు జమయ్యాయి. దీనిపై అప్పటి గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి గొంది నాగరాజు(రాణి)ను ఆమె ప్రశ్నించగా.. . బ్యాంక్ ఖాతాలు లేని రైతుల ధాన్యం కొనుగోలు మొత్తాన్ని జమచేసేందుకు రిజ్వానా అకౌంట్ ఇచ్చినట్లు సమాధానమిచ్చింది.
రిజ్వానా తన ఖాతాలోని నగదు డ్రా చేసి రాణికి, ఆమె కుమార్తె గొంది ప్రగతికి ఇచ్చింది. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రూ.కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తన పేరిట జరిగిన ధాన్యం విక్రయ పత్రాల్ని రిజ్వానా పరిశీలించగా.. ట్రాక్‌షీట్, రైతు కొనుగోలు ధ్రువపత్రం, రైతు చెల్లింపు తదితర పత్రాలపై ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. దీనిపై జిల్లా కలెక్టర్, వెలుగు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగు అధికారులు విచారణ జరిపి రిజ్వానా సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు.
ఈ వ్యవహరంపై గతేడాది నవంబర్ 16న ఆమె గన్నవరం సీఐ, విజయవాడ సీపీతో పాటు జిల్లా కలెక్టర్, డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గన్నవరంలోని 11వ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 200 కింద గొంది నాగరాజు(రాణి), ఆమె కుమారై గొంది ప్రగతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీసులను కోర్టు ఆదేశించింది. రెండు వారాల అనంతరం పోలీసులు సోమవారం వీరిద్దరిపై సెక్షన్ 420, 468, 471, 477, 506, 120(బి) రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment