ఆయేషా హత్య కేసులో సీబీఐ ముందడుగు | CBI Move Forward in Ayesha murder case | Sakshi
Sakshi News home page

ఆయేషా హత్య కేసులో సీబీఐ ముందడుగు

Published Sun, Dec 30 2018 4:10 AM | Last Updated on Sun, Dec 30 2018 4:10 AM

CBI Move Forward  in Ayesha murder case - Sakshi

విజయవాడ లీగల్‌: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బి–ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ ఒకడుగు ముందుకు వేసింది. నగరంలోని వివిధ కోర్టులలో పనిచేస్తున్న వై.సుబ్బారెడ్డి (మహిళ సెషన్స్‌ కోర్టు), వెంకటకుమార్‌ (ఫ్యామిలీ కోర్టు), కుమారి (మైలవరం)పై సీబీఐ 120 బి, 201, 409, 13(2) రెడ్‌విత్‌ 13(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. 2007 డిసెంబర్‌ 26 రాత్రి ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థిని ఆయేషాపై లైంగికదాడికి పాల్పడిన దుండగులు హత్య చేశారు. కేసులో నిందితుడిగా పోలీసులు ప్రవేశపెట్టిన పిడతల సత్యంబాబుకు మహిళ సెషన్స్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఈ తీర్పుపై సత్యంబాబు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోగా వాదనలు విన్న కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అదే సమయంలో కేసులో అసలు దోషులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించింది. కేసు విచారణలో భాగంగా, ప్రభుత్వం నలుగురు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది. అయినా కేసు విచారణలో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడంతో ప్రజాసంఘాలు, ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే అప్పటి విచారణ అధికారులపై ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపట్టలేదని, సిట్‌ అధికారులు సరిగా విచారణ చేయడం లేదంటూ హైకోర్టుకు, డీజీపీకి విన్నవించారు. మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌ ఉన్న వస్తువులు తగలబడి పోయాయని హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేశారని, అసలు ఇదంతా నిందితుల ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆయేషా తల్లిదండ్రులు 15 అంశాలతో కూడిన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో సాక్ష్యాలను తగలబెట్టి తారుమారు చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేశారు?
మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌ను తగలబెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు చేశారు..  ఎవరి ప్రోద్బలంతో చేశారు.. అన్నవి ఇప్పుడు తేలాల్సిన ప్రశ్నలు. నగరంలోని నాల్గవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఆయేషా హత్యకు సంబంధించిన మెటీరియల్‌ ఆబ్జెక్టŠస్‌ అయిన పచ్చడి బండ, రెండు కండువాలు, రక్తపు మరకలున్న రెండు బెడ్‌ షీట్స్, మరకలున్న నైట్‌ ప్యాంటు, బ్రా, రక్తపు మరకలున్న రెండు దిండ్లను ఇబ్రహీంపట్నం పోలీసులు దాఖలు చేశారు. వాటిని 2014లోనే తగలబెట్టినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సిట్‌ అధికారులు కోర్టుకు వచ్చినపుడు సిబ్బంది తెలిపారు. ఇదే ముగ్గురిపై శాఖాపరమైన విచారణ జరిగింది. విచారించిన న్యాయమూర్తి మెటీరియల్‌ ఆబ్జెక్టŠస్‌ తగలబడటానికి ఈ ముగ్గురే కారణమని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కోణంలో విచారణ చేయాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement