ఈసారి చెన్నై పోలీసులకు.. | Chain Snatcher Amol Arrested By Cyberabad Police | Sakshi
Sakshi News home page

ఘరానా స్నాచర్‌ అమోల్‌  బాబా మళ్ళీ అరెస్టు

Published Mon, Mar 2 2020 10:49 AM | Last Updated on Mon, Mar 2 2020 10:49 AM

Chain Snatcher Amol Arrested By Cyberabad Police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు అమోల్‌.. మహారాష్ట్రకు చెందిన ఇతగాడు జల్సాలకు అలవాడుపడి నేరగాడిగా మారాడు.. కుడిచేత్తో బైక్‌ నడుపుతూ ఎడమ చేత్తో స్నాచింగ్‌ చేస్తాడు.. దక్షిణాదిలో బంగారం ఎక్కువనే ఉద్దేశంతో ఈ వైపునకు వచ్చాడు.. సైబరాబాద్‌లో 17 నేరాలు చేసి 2018లో పోలీసులు చిక్కాడు.. తాజాగా హైదరాబాద్‌లో చోరీ చేసిన బైక్‌ వాడి చెన్నైలో నాలుగు నేరాలు చేశాడు.. ఇక్కడి పోలీసుల సహకరారంతో అక్కడి పోలీసులు అమోల్‌ను ఇటీవల అరెస్టు చేశారు.  

జల్సాల కోసం నేరబాట.. 
మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా యశ్వంత్‌నగర్‌కు చెందిన అమోల్‌ బాబాసాహెబ్‌ షిండే కుటుంబం పెద్దదే. పెద్దగా చదువుకోని ఇతగాడు బతుకుతెరువు కోసం డ్రైవర్‌గా మారాడు. ఈ వృత్తిలో వస్తున్న ఆదాయం కుటుంబ పోషణ, తన జల్సాలకు సరిపోకపోవడంతో నేరాల బాటపట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్‌ స్నాచర్‌గా మారాడు. 2013లో అక్కడి పర్భనీ జిల్లాలో గొలుసు దొంగతనానికి పాల్పడి తొలిసారిగా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాతి ఏడాది జైలు నుంచి విడుదలైన ఇతగాడు తన మకాంను ఔరంగాబాద్‌కు మార్చాడు. అక్కడ వరుసగా నాలుగు స్నాచింగ్స్‌ చేసి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో బెయిల్‌పై వచి్చన తర్వాత కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు.  

స్నేహితుడి సలహాతో ఇటు.. 
అమోల్‌ 2016లో లాతూర్‌లో షెల్టర్‌ ఏర్పాటు చేసుకుని సంజయ్‌ హాకాని యాదవ్‌ అనే మరో నేరగాడితో కలిసి ముఠా కట్టాడు. అయితే ఏ ఉదంతంలోనూ అతడితో కలిసి నేరం చేయలేదు. సంజయ్‌ను కేవలం ‘సలహాలు–సూచనలకు’ మాత్రమే పరిమితం చేశాడు. మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో స్నాచింగ్‌ చేసినా.. ఆ గొలుసు కనీసం తులం కూడా ఉండట్లేదని సంజయ్‌ వద్ద వాపోయాడు. దీంతో దక్షిణాదిలో ఉన్న వాళ్లు.. ప్రధానంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా బంగారం ధరిస్తారని అక్కడ స్నాచింగ్స్‌ చేస్తే ఒక్కో గొలుసు కనీసం మూడు తులాలు ఉంటుందని సలహా ఇచ్చాడు. దీంతో అమోల్‌ కన్ను 2017 ఈ ప్రాంతంపై కన్నేశాడు. ఆ ఏడాది ఆగస్టులో లాతూర్‌లోనే ఓ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ ఖరీదు చేసి దాని పైనే హైదరాబాద్‌కు వచ్చాడు.  

సిగింల్‌ హ్యాండ్‌ స్నాచర్‌.. 
ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత లాడ్జిలో బస చేసి, పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాతనే అమోల్‌ స్నాచింగ్‌ చేస్తుంటాడు. దేవాలయాలు, దుకాణాలకు ఒంటరిగా వెళ్ళే మహిళల్నే ఇతగాడు టార్గెట్‌గా చేసుకునే వాడు. స్నాచింగ్‌ చేయడానికి ఇతడికి ఎవరి సహాయం అవసరం లేదు. తానే స్వయంగా బైక్‌ను నడుపుకుంటూ టార్గెట్‌కు ఎదురుగా వచ్చి వారి పక్కగా వాహనాన్ని పోనిచ్చేవాడు. హఠాత్తుగా తన ఎడమ చేత్తో వారి మెళ్ళోని గొలుసు లాక్కుని ఉడాయించేవాడు. ఈ పంథాలో కేపీహెచ్‌బీలో మూడు, మియాపూర్‌లో ఒక నేరం చేసి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 జనవరి 6న సిటీకి వచి్చన అమోల్‌ మియాపూర్‌లోని గాయత్రి లాడ్జిలో బస చేశాడు. అదును చూసుకుని మియాపూర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, కేపీహెచ్‌బీలో మరోటి స్నాచింగ్స్‌ చేశాడు. ఇలా మొత్తం ఐదు నెలల కాలంలో 17 స్నాచింగ్స్‌కు పాల్పడి పోలీసులకు  కంటిమీద కునుకు లేకుండా చేశాడు.  

మరోసారి వచ్చినప్పుడే చిక్కి.. 
ఈ నేరాలు చేస్తున్నప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు అనుమానితుడి ఫొటోను ఇతర రాష్ట్రాలకు పంపారు. దీంతో మహారాష్ట్ర పోలీసుల ఆ నేరగాడు అమోల్‌ అని గుర్తించి సైబరాబాద్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం పర్భనీకి వెళ్ళినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి నిఘా ఉంచిన పోలీసులు 2018 జనవరి 28న మరోసారి సిటీకి వచి్చనట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అనేక చోట్ల గాలించి చివరకు మియాపూర్‌లో పట్టుకుని అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇతడి నుంచి దాదాపు 47 తులాల బంగారం రికవరీ చేశాడు. ఇతడిపై మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ కేసులు ఉన్నాయని, పలు ఎన్‌బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు.
సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన అమోల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement